ఎన్నిమార్లు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నా సరే.. మంజూరు కాకుండా ఇంకా రిమాండులోనే గడుపుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముందుముందు ఇంకా గడ్డురోజులు రానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వంశీకి కీలక అనుచరుడిగా, ఆయన పురమాయించిన అరాచకాలకు నేతృత్వం వహించే ఓలుపల్లి రంగారావు (రంగా) ఇన్నాళ్లుగా పరారీలో ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడి కేసులోను, దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ వంశీతో సహా రంగా కూడా నిందితుడిగా ఉన్నారు. వంశీ పోలీసులకు దొరికారు గానీ.. రంగా ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనను ఎట్టకేలకు మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగా కూడా అరెస్టు కావడంతో.. ముందు ముందు వల్లభనేని వంశీకి మరింత గడ్డు రోజులు తప్పకపోయే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
జగనన్న కళ్లలో ఆనందం చూడడం కోసం అన్నట్టుగా.. వల్లభనేని వంశీ చేసిన మొదటి తప్పు.. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయించడం. పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినా.. అప్పట్లో నామ్ కే వాస్తే కేసులు పెట్టారు. పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులను తిరగతోడారు. వల్లభనేని వంశీ మీద కూడా టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నమోదు అయింది. ఈలోగా జాగ్రత్త పడిన వంశీ, అతి తెలివి ప్రదర్శించి.. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ కార్యాలయ ఉద్యోగి, దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించి.. ఒక రోజు హైదరాబాదులోని తన ఇంట్లో నిర్బంధించి.. ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీకి అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించారు. తర్వాత విశాఖకు తరలించి అక్కడ నిర్బంధించారు. ఈ బాగోతాలన్నీ బయటపడ్డాయి.
దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు వంశీని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. మంగళవారం నాడు కోర్టు మరోసారి రిమాండు పొడిగించడంతో.. ఆయన వచ్చే నెల 8 దాకా జైలులోనే ఉండనున్నారు.
దాడి కేసుల్లో వంశీ ఏ2 కాగా, స్వయంగా దాడిలో పాల్గొన్న అసలు కీలక నిందితుడు ఏ1 ఓలుపల్లి రంగారావు.. వంశీకి కుడిభుజం అన్నమాట. ఆయన ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగినా.. ఇప్పుడు అరెస్టు అయ్యారు. పోలీసులు రంగాను కోర్టు ఎదుట ప్రవేశపెట్టి కస్టోడియల్ విచారణకు తీసుకునే అవకాశం ఉంది. రంగా గనుక.. పార్టీ ఆఫీసుపై దాడి కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు వెల్లడిస్తే.. వంశీ పని క్లోజ్ అయినట్టేనని ప్రజలు అనుకుంటున్నారు. విచారణలో ఇప్పటిదాకా వంశీ చెప్పిన విషయాలను, ఇప్పుడు రంగా ద్వారా తెలిసే విషయాలను పోలీసులు సమన్వయం చేసుకుని.. విచారణను వేగవంతం చేస్తారని.. ఏ రకంగా చూసినా కూడా.. రంగా అరెస్టు తర్వాత.. వంశీకి మరింత గడ్డురోజులు తప్పకపోవచ్చుననే సంకేతాలే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు.