ఎన్నికల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే.. అమరావతిలో అభివృద్ధిపనులు ప్రారంభం అవుతాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించి ఒక్క రోజు కూడా కాలేదు. ఆ మాటల ద్వారా ఆయన అమరావతి రాజధాని ప్రేమికులకు గొప్ప శుభవార్తనే చెప్పారు. అమరావతి ప్రాంత రైతులు మాత్రమే కాకుండా మన రాష్ట్రానికి హైదరాబాదును తలదన్నే గొప్ప రాజధాని ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ లోకేష్ మాటలతో సంతోషించారు. అంతే.. అంతలోనే వైఎస్సార్ కాంగ్రెస్ లోని విషనాగులు బుసలు కొట్టాయి. వ్యూహరచన చేశాయి. అప్పటికప్పుడు ఆ వ్యూహాలను అమలులో కూడా పెట్టాయి. ‘గెలిచిన వెంటనే పనులు ఎలా ప్రారంభిస్తారో చూస్తాం.. అసలక్కడ సామగ్రిని ఉంచితే కదా.. వెంటనే మీరు పనులు చేసేది..’ అని పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇంతకూ విషయం ఏంటంటే.. అమరావతి రాజధాని పనులకోసం ఉద్దేశించి తెప్పించిన తాగునీటిపైపులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ అక్కడినుంచి తరలించి తీసుకువెళ్లిపోయింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి నియోజకవర్గం అయిన డోన్ లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకోసం వీటిని తీసుకువెళ్లినట్టుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలూ లేకపోగా.. కేవలం మంత్రి నోటి మాట మీద అమరావతి రాజధాని కోసం తెప్పించిన పైపులను మొత్తం మేఘా సంస్థ దుర్మార్గంగా.. డోన్ కు తరలించేసినట్టు వార్తలు వస్తున్నాయి. లోకేష్ అమరావతి పనులు తిరిగి ప్రారంభించడం గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారో లేదో.. అక్కడ ఈ అయిదేళ్లుగా ఉన్న పైపులను హడావుడిగా ఎత్తుకెళ్లిపోవడం జగన్ సర్కారు అమరావతి పట్ల చేయగలుగుతున్న విషపూరితమైన కుట్రల్లో మరొకటి అని ప్రజలు భావిస్తున్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో వచ్చే యాభైఏళ్లలో పెరగగల జనాభా అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలు తీర్చేందుకు చంద్రబాబు హయాంలో ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా భూగర్భంలో పైపు లైన్లు వేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 13 జోన్లుగా ప్యాకేజీల్ని విభజించి టెండర్లు పిలిచారు. ఒక ప్యాకేజీని మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. అప్పట్లో పనులు మొదలయ్యాయి. పైపులైన్ల కోసం ఇనుప పైపులను పెద్దసంఖ్యలో అక్కడకు తెప్పించారు. వాటికి సంబంధించి సీఆర్డీయే బిల్లులు కూడా చెల్లించేసింది. పని జరిగినా జరగకపోయినా ఆ పైపులు అమరావతి యొక్క ప్రాపర్టీ అని అనుకోవాలి.
అయితే తాజాగా బుగ్గన నియోజకవర్గం డోన్ లో వాటర్ గ్రిడ్ పనులు కూడా మేఘా సంస్థ చేస్తోంది. అక్కడి అవసరాలకోసం అని చెబుతూ ఇక్కడినుంచి పైపులను తరలించి తీసుకెళ్లిపోయారు. ఒకే సంస్థ రెండు చోట్లా పనులు చేస్తుండవచ్చు. కానీ, అమరావతి కోసం కొన్న పైపులకు సీఆర్డీయే నుంచి బిల్లులు కూడా తీసుకున్న తరువాత.. ఇలా తరలించుకు వెళ్లిపోవడం ఒక రకంగా దొంగతనమే. అయినా సరే.. సీఆర్డాయే పట్టించుకోకుండా ఉండిపోయింది.
తెలుగుదేశం గెలిచిన తర్వాత కూడా అమరావతిలో పనులు సత్వరం పునరుద్ధరణ కాకుండా చూడడానికి జగన్ సర్కారు ఇప్పటినుంచే కుట్రలు పన్నుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.