మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తీవ్రమైన వైరం పెట్టుకున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అదనపు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె స్వయంగా అడగకపోయినప్పటికీ.. ప్రభుత్వం అదనపు భద్రత కల్పించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద ఆమె డైరెక్టుగా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో.. ఆమె భద్రత ప్రశ్నార్థకంగా మారిందనే సందేహం ప్రజల్లో ఉంది. పలువురు నాయకులు కూడా ఆమెకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని పిల్లలిద్దరి తగాదా ఇప్పుడు కేవలం ఆస్తి తగాదా రూపంలో లేదు. ఒకరి వలన మరొకరు పరువు ప్రతిష్ఠలకు వ్యాపారాలకు కూడా తీవ్రమైన దెబ్బ పడే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒకరి గురించి మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఉన్నారు. స్థూలంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి .. రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారం వెలగబెట్టిన ఒక అతిపెద్ద పార్టీ యొక్క అండ కనిపిస్తోంది. అందుకే ఆయనను షర్మిల చిన్న మాట అంటే చాలు.. బోలెడు మంది వైసీపీ నాయకులు ఆమె మీద విరుచుకుపడిపోతున్నారు.
మరో వైపు షర్మిల ఒంటరిగానే అన్నతో పోరాడుతున్నారు. ఆమెకు మద్దతుగా గళం విప్పుతున్న వారు పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జగన్ గురించి చేదు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే.. వైసీపీకి చెందిన కార్యకర్తలు ఆమె మీద దాడికి దిగినా దిగవచ్చునని పలువురు అనుమానిస్తున్నారు.
తాజాగా పానుగంటి చైతన్య అనే నిందితుడు తెదేపా ఆఫీసుపై జరిగిన దాడి కేసు గురించి చెప్పిన విషయాల్ని కూడా గమనించాలి. ‘మనం అభిమానించేనాయకుడు జగన్ ను పట్టాభి తిడితే సైలెంట్ గా ఎలా ఉంటాం?’ అంటూ రెచ్చగొట్టి దాడికి పంపినట్టుగా సీఐడీ విచారణలో చెప్పారు. ఇప్పుడు షర్మిల- జగన్ గురించి తిడుతున్న తిట్లు అంతకంటె తీవ్రమైనవి. జగన్ కు అంతకంటె ఎక్కువ నష్టం చేసేవి. మరి ఇలాంటప్పుడు షర్మిలను వైసీపీ ముఖ్యనాయకులు ఊరికే వదిలిపెడతారా? అనేది ప్రజల సందేహం. ప్రభుత్వం కూడా ఇలాంటి కారణాల చేతనే షర్మిలకు అదనపు భద్రత ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేదాకా వేచిచూడడం కంటె.. ముందుగానే భద్రత ఇస్తే మంచిదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు స్కెచ్ ప్రకారం షర్మిల మాట్లాడుతోందని నిందలు వేస్తున్న వైసీపీ దళాలు.. అదనపు భద్రత ఇస్తే ఇంకా దుష్ప్రచారం పెంచుతాయనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. మరి షర్మిల ఆ భద్రత తీసుకోవడానికి.. తనను తాను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో?