సీనియర్ నటి రాధిక కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. ఆమె తల్లి గీతా రాధ ఇక లేరు. 86 ఏళ్ల వయసులో చెన్నైలో ఆమె కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ చివరికి ప్రాణాలు విడిచారు.
రాధిక స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టగా, సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. అభిమానులు, బంధువులు చివరి వీడ్కోలు చెప్పేందుకు ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్‌లో ఉంచారు. అనంతరం ఇవాళ చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
గత కొన్ని నెలలుగా గీతా రాధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత వరకు కోలుకున్నప్పటికీ, ఇటీవల ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. చివరికి పరిస్థితి విషమించి ఆమె మృతిచెందారు. ఈ వార్త తెలిసిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రాధిక కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, గీతా రాధ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.