తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ఏ1 పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో కొన్ని విషయాలు వెల్లడించారు. కొన్నింటిని దాచారు. ఒక్క విషయంలో మాత్రం ఈ కేసులోని నిందితులు అందరూ ఒకే మాట మీద ఉండడం ముచ్చట గొలుపుతున్న సంగతి. ‘విచారణ నిమిత్తం మీ ఫోను ఇవ్వండి’ అని అడిగితే మాత్రం.. నిందితులు అందరూ ఇంతెత్తున ఎగిరిపడుతున్నారు. వాళ్లు ఫోను ఇవ్వకపోవడం వల్ల సాక్ష్యాలు దొరక్కపోవచ్చు. కానీ వ్యవహారం మొత్తం ఫోన్ల పురమాయింపుల మీద నడిచిందని.. ఎలాంటి విధ్వంసానికి కుట్రరచన జరిగిందో సమస్తం పెద్దనేతల పురమాయింపు మీదనేనని తెలిసిపోతోంది.
తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో ఏ1 నిందితుడు పానుగంటి చైతన్య సీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూంలంలో పానుగంట చైతన్య కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. గొప్ప ట్విస్టు ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడిచేసి విధ్వంసం సృష్టించాలనేది మాత్రమే అతనికి ఆరోజున అందిన ఎజెండా! ఎందుకు దాడిచేస్తున్నామో కూడా అతనికి తెలియదు. తెలుగుదేశానికి చెందిన పట్టాభి- జగన్మోహన్ రెడ్డిని ఏం అన్నారో కూడా తనకు తెలియదని పానుగంటి చైతన్య పోలీసులకు చెప్పారు. మనం అభిమానించే నాయకుడు జగన్ ను తెదేపా నాయకుడు పట్టాభి తిడితే సైలెంట్ గా ఉన్నావేంటి అని పార్టీ ముఖ్యనేతలు రెచ్చగొట్టి తెదేపా ఆఫీసుపై దాడికి పంపినట్లుగా మాత్రం సీఐడీ పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.
అలా రెచ్చగొట్టింది ఎవరు? దాడికి పురమాయించి పంపింది ఎవరు? అంటే మాత్రం చైతన్య పెదవి విప్పడం లేదు. అప్పట్లో వారు పార్టీలో ప్రభుత్వంలో పెద్దపవుల్లో ఉన్నవారంటూ సమాధానం దాటవేసినట్టు తెలుస్తోంది. పానుగంటి చైతన్య మూడురోజుల కస్టోడియల్ విచారణ ఆదివారం ముగిసింది. దాడి చేసినందుకు తనకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది.
అయితే ఫోను విషయానికి వచ్చేసరికి అందరు నాయకులు ఎలాంటి సమాధానాలు చెబుతున్నారో అదే జవాబు చైతన్య కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ‘ఆ ఫోను ఇప్పుడు వాడడం లేదు. ఎప్పుడో మార్చేశాను. ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసలు నా ఫోనుతో మీకేం పని? కోర్టు ఆదేశిస్తే మాత్రం ఆ ఫోను అప్పగిస్తా’ వంటి జవాబులే చైతన్య కూడా చెప్పారు. లేళ్ల అప్పిరెడ్డి నుంచి సజ్జల రామక్రిష్ణారెడ్డి దాకా అందరూ ఇదే జవాబులు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. మొత్తానికి వైసీపీలో, ప్రభుత్వంలో పెద్దలే రెచ్చగొట్టి దాడికి పురమాయించారని సగం నిజం చెప్పిన చైతన్య.. వారు ఎవరు అనే సగం నిజాన్ని మాత్రం దాచినట్టుగా కనిపిస్తోంది.