తిరుమలలో కారుకూతలకు చెల్లుచీటీ!

వారు రాజకీయ నాయకుల మసుగులో ఉంటారు. తిరుమల దేవదేవుడిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారిని దర్శించుకుంటారు. తమ పదవుల గురించో, అవినీతి బాగోతాల గురించి, అక్రమ వ్యాపారాల గురించో ఏదో వారికి తోచిన ముక్కులు మొక్కుకుంటారు. అక్కడ ఉత్తరీయాలు కూడా కప్పించుకుంటారు.. తీరా తిరుమలేశుని ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత.. అక్కడ మీడియాతో మాట్లాడతారు. అప్పుడు చూడాలి వారి వివ్వరూపం!

పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో.. దైవ సన్నిధానంలో ఉన్నామనే స్పృహ వారికి ఉండదు. మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడాలి.. తిరుమలలో అందుతున్న సేవల గురించి మాత్రామే మాట్లాడాలి.. తాము ఏ కోరికలతో దేవుడి వద్దకు వచ్చామో ఇష్టమైతే చెప్పాలి.. అంతే తప్ప.. ఆ పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేయకూడదనే ఇంగిత జ్ఞానం వారికి ఉండదు. తమ రాజకీయ వాచాలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థుల మీద తిరుమలేశుని ఆలయం ఎదురుగా నిల్చుని నానా చెత్త మాటలు మాట్లాడుతూ, విమర్శలు చేస్తూ అనుచితంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి అసహ్యకరమైన పోకడలు అన్నింటికీ.. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి అడ్డుకట్ట వేసింది.

శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని తితిదే తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కొన్నాళ్ల కిందట జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని పాలకమండలి హెచ్చరిస్తోంది.
తిరుమలకు వెళ్లే నాయకులు ఆలయం నుంచి వెలుపలికి రాగానే.. తమ రాజకీయ ప్రత్యర్థులను దుమ్మెత్తిపోయడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నారు. ధార్మిక క్షేత్రం పవిత్రతను కాపాడడం తమ బాధ్యత అని వారు అనుకోరు. అలాంటి వారు మీడియా ప్రెస్ మీట్లలో మాట్లాడే బురద మాటలకు ఇక టీటీడీ నిర్ణయం చెక్ పెట్టినట్టే.

ఇదొక ఎత్తు అయితే.. ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు తిరుమల ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా నిల్చుని నలుగురు తన సొంత ఫోటో, వీడియోగ్రాఫర్లను ఏర్పాటుచేసుకుని వారిద్వారా దిగిన ఫోటో సెషన్ కూడా వివాదం రేపుతోుంది. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు మాధురితో కలిసి చేసిన రీల్స్ ఒక వివాదం. ఇలాంటి వ్యవహారాల మీద కూడా టీటీడీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories