రాష్ట్రంలో ఏ మూలనైనా సరే.. రెండు పార్టీల మధ్య తగాదా జరిగితే చాలు.. వెంటనే రెచ్చిపోయి ఇరువర్గాలను మరింతగా పురిగొల్పే ప్రకటనలు చేయడం.. మిగిలిన శాంతి భద్రతలను కూడా నాశనం చేయడానికి చూడడం లక్ష్యంగా బతికే రాజకీయ నాయకులు కొందరుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో మామూలు ఘర్షణల్లో వైసీపీ కార్యకర్త ఎవరైనా చనిపోయినా కూడా.. వెంటనే అక్కడకు వెళ్లి వాలిపోవడం.. రాజకీయ హత్యలు జరిగిపోయాయని రాద్ధాంతం చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయి.. ఇక్కడ వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అని డిమాండు చేయడం.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఆయన అదే పనిచేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డి పల్లిలో లింగమయ్య అనే పార్టీ కార్యకర్త చనిపోతే.. ఆ చావునుంచి గరిష్టంగా రాజకీయ ఎడ్వాంటేజీ పిండుకోవాలని చూస్తున్నారు జగన్! అయితే.. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అనే మిషమీద అనేక రాజకీయ ప్రయోజనాలను ఆయన ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తన పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టుగా ఒక విషప్రచారం దీనికి అదనం.
పాపిరెడ్డిపల్లిలో కుటుంబాన్ని జగన్ పరామర్శించాలి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రం చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ కు అనుమతి అడిగారు. పోలీసులు అక్కడ అనుమతించకుండా, కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి ఇది సర్కారు కుట్రగా ఆ పార్టీ అభివర్ణిస్తున్నది. అయినా పాపిరెడ్డిపల్లిలో పరామర్శకు అక్కడకు దూరంగా ఇంకోకచోట హెలిప్యాడ్ ఎందుకు అనేది ప్రజల ప్రశ్న.
జగన్ కోరిక లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం వారికి భరోసా ఇవ్వడం మాత్రమే కాదు.. ఒక పెద్ద యాత్రలాగా ప్రదర్శన సాగించి.. జనాన్ని పోగేయించి.. వారితో ‘సీఎం సీఎం’ అంటూ జేజేలు కొట్టించుకోవడం కూడా.. అని ప్రజలు విమర్శిస్తున్నారు.
పైగా హెలిప్యాడ్ వద్దకు పోలీసులు పెద్ద సంఖ్యలో రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించడాన్ని కూడా ఆయన పర్యటన మీద జరుగుతున్న పెద్ద కుట్రగా వైసీపీ అభివర్ణిస్తున్నది. అయినా హెలిప్యాడ్ వద్దకు ప్రజలు ఎందుకు రావాలి? ఆయన ఎటూ పాపిరెడ్డి పల్లి వస్తారు గనుక.. జనం అక్కడకు వస్తే సరిపోతుంది కదా.. అనేది ప్రజల ప్ఱశ్న. జగన్ కోరిక ఏంటంటే.. తాను హెలిప్యాడ్ లోంచి కాలు బయటపెట్టే సమయానికే.. వేలమంది పోగై సీఎం నినాదాలు చేస్తూ తననకు కీర్తించాలని, తాను ముసిముసి నవ్వులతో వారికి అభివాదం చేయాలని ఆయన కోరిక.
జైళ్లలో పరామర్శలకు, చావుల పరామర్శలకు తప్ప జగన్ ఓడిపోయిన నాటినుంచి ఎక్కడకూ కదలడం లేదనే విమర్శలు పార్టీలోనే ఉన్నాయి. ఆ సందర్భాల్లోనే ఆయన పర్యటనలకు జనాన్ని పోగేయలేక ఇబ్బంది పడుతున్నాం అని.. పార్టీ నాయకులు వాపోతుండడం గమనార్హం.