విభజన చట్టంలో ఒక అంశంగా పొందుపరిచిన తర్వాత కూడా.. విశాఖకు రైల్వే జోన్ రావడం అనేది పెద్ద గొప్ప సంగతి ఏముంది? దానిని ఘన విజయంగా అనుకుంటే ఎలాగ? అని ఓర్వలేని వారు ఏదైనా ప్రచారం చేయవచ్చు గాక! కానీ విభజన అనంతరం జరిగిన అనేకానేక పరిణామాలు.. చంద్రబాబు తర్వాత సీఎంగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తిరోగమన దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన వైనం ఇవన్నీ కలిసి విశాఖ రైల్వేజోన్ కు కూడా శాపంగానే మారాయి. తీరా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గానీ.. ఆ స్వప్నం సాకారం కావడం లేదు. విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి ఈ ఏడాది డిసెంబరులో శంకుస్థాపన జరగబోతోంది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు స్వయంగా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది. ఎన్డీయే కూటమి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా అధికారంలో ఉంటే గనుక.. ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయో ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం తరఫు నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. అలాగే ఉత్తరాంధ్రవాసుల నిజమైన కల అయినటువంటి విశాఖ రైల్వేజోన్ కార్యరూపం దాలుస్తోంది.
రైల్వేజోన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు జోన్ ఇవ్వబోతున్నట్టుగా కేంద్రం చట్టంలోనే పొందుపరిచింది. నిజం చెప్పాలంటే అప్పుడు కూడా డబుల ఇంజిన్ సర్కారే ఉంది. చంద్రబాబునాయుడు జోన్ సాధించడానికి తీవ్రమైన కసరత్తు చేశారు. కేంద్రంతో పలుమార్లు మంతనాలు జరిపారు. ఆల్మోస్ట్ రైల్వేజోన్ సాధించుకువచ్చారు. అప్పట్లోనే గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు తలపెట్టిన అభివృద్ధి పనులు అన్నింటినీ సర్వనాశనంచేయడం ఒక్కటే తన ఎజెండా అన్నట్టుగా ఆయన చెలరేగిపోయారు. అమరావతిని స్మశానంగా మార్చేశారు. ఇతరత్రా అభివృద్ధి పనులను పడకేయించారు. ఏ చిన్న పని పూర్తయినా సరే.. చంద్రబాబునాయుడుకు ఎక్కడ కీర్తి ప్రతిష్టలు దక్కుతాయేమో అనే భయంతో అన్నింటినీ విధ్వంసం దిశగా నడిపించారు. అందులో భాగంగానే.. విశాఖ రైల్వేజోన్ కూడా వెనక్కు వెళ్లింది.
జోన్ కు కేంద్రం ఓకే చెప్పేసి.. పనులు ప్రారంభించడానికి కూడా సిద్ధం అయ్యాక.. స్థలకేటాయింపుల విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ డ్రామాలాడుతూ.. రైల్వే వారికి వివాదరహితంగా భూమిని అప్పజెప్పకుండా అసలు పనులే మొదలుకాకుండా చేసిన నాయకుడు జగన్. అయిదేళ్లు ఆలయన పాలన అంతరించిపోయాక రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటినుంచి అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్ వ్యవహారాలపై గరిష్టంగా శ్రద్ధ పెడుతున్నారు. అన్ని పనులూ సమాంతరంగా వేంగా జరుగుతున్నాయి. తాజాగా రైల్వేజోన్ పనులకు ముహూర్తం కూడా ఖరారైంది. ఏకంగా ప్రధాని స్వయంగా వచ్చి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. రాష్ట్రం రాబోయే అయిదేళ్లలో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందనే కొత్త ఆశలకు ఈ పరిణామాలు ఊపిరిపోస్తున్నాయి.