ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రపంచం మొత్తం కూడా ఇటువైపు తలతిప్పి చూసేలా అమరావతి ఆవిర్భవించబోతున్నదని సంతోషపడిన ప్రజలు కోట్లలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వారి ఆశలు మొత్తం ఛిద్రం అయ్యాయి. మూడు రాజధానులు అనే మాయ మాటలతో జగన్మోహన్ రెడ్డి అమరావతి ఆశలను చిదిమేసారు. జగన్ తీసుకున్న ఆ అసంబద్ధ నిర్ణయం తరువాత.. అమరావతి రైతులు దీక్షలు ప్రారంభించారు. కోర్టులకు వెళ్ళారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందే అని హై కోర్ట్ స్పష్టమైన తీర్పు చెప్పిన తరువాత కూడా.. జగన్ సర్కారు అసలు పట్టించుకోలేదు. రైతులు మాత్రమే కాదు.. అమరావతిని ప్రేమించే అందరూ కూడా మధన పడుతూనే ఉన్నారు. అలాంటి వారందరికీ నారా లోకేష్ ఒక తియ్యటి శుభవార్త చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే అమరావతిలో అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు.
చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథలాగా ఏర్పడినప్పుడు.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అమరావతి అద్భుత రాజధానికి రూపకల్పన చేశారు. ఆయన ఆలోచనకు అమరావతి ప్రాంత రైతన్నలు కూడా నీరాజనాలు పలకుతూ.. స్వచ్ఛందంగా యాభైవేల ఎకరాలకు పైగా భూములను ఇచ్చారు. మొత్తానికి అమరావతి రాజధాని ప్రాజెక్టు మొదలైంది. సిబ్బంది, ఐఏఎస్ క్వార్టర్స్ సహా సెక్రటేరియేట్ నిర్మాణం కూడా ప్రారంభం అయింది. తాత్కిలిక సచివాలయాన్ని పూర్తిచేశారు. భవిష్యత్తులో దానిని ఇతర కార్యాలయాల అవసరాలకు వాడవచ్చునని నిర్ణయించారు. ప్లాన్లను సిద్ధం చేయడానికి, తుదిరూపు ఇవ్వడానికి కొంత ఆలస్యం జరిగింది గానీ.. ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇన్‌ఫ్రా పనులు వేగంగా జరుగుతున్నాయి. జగన్ సర్కారు ఏర్పడడంతో మొత్తం ఎక్కడవేసిన గొంగళి అక్కడనే అన్నట్టుగా తయారైపోయింది.
ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ జగన్ కొత్త వంచన ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం చెప్పుకోడానికి ఒక రాజధాని కూడా లేకుండా దయనీయ స్థితికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రంలో సర్కారు దిగిపోవాల్సిందేనని ప్రజలు కృతనిశ్చయంతో అనుకుంటున్న తరుణంలో.. నారా లోకేష్ అమరావతి ప్రియులకు ఘనమైన హామీ ఇచ్చారు. తెలుగుదేశం సర్కారు ఏర్పడగానే పనులన్నీ తిరిగి ప్రారంభం అవుతాయని అంటున్నారు. కొన్ని పనులు 70-80 శాతం పూర్తయినవి ఉన్నాయి. కొన్ని సగం జరిగాయి. కొన్ని మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ.. కొద్దికొద్దిగా పనులు పూర్తిచేసుకుంటూ పోతే అమరావతి స్వప్నం అద్భుతంగా సాకారం అవుతుందని అంతా అనుకుంటున్నారు.