వంశీ మెడచుట్టూ మరింత బలమైన ఉచ్చు!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని, ఆయన పంచన చేరి సాగించిన అరాచకాలకు అంతేలేదు. ఆ పాపాలు ఇప్పుడు ఆయనను ఒక్కటొక్కటిగా చుట్టుముడుతున్నాయి. ఇప్పట్లో వంశీకి విముక్తి దక్కదేమో అనిపించే రీతిలో కేసులు బలంగా తయారవుతున్నాయి. తాజాగా తన నియోజకవర్గంలోని ప్రజల ఆస్తులను బెదిరించి, తన బినామీల పేరిట రాయించుకున్నారనే భూవివాదం ఆరోపణల్లో వంశీ మరింత లోతుగా కూరుకుపోయారు. ‘వంశీ బాధ్యతగల ఎమ్మెల్యేగా ఉండి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు.. ఇది చాలా తీవ్రమైన అంశం.. ఇలాంటి వ్యక్తికి ముందస్తు బెయిలు ఇచ్చే అంశాన్ని పరిశీలించలేం’ అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనిస్తే.. వంశీ ఎంత సీరియస్ గా ఈ కేసుల్లో ఇరుక్కున్నారో అర్థమవుతోంది.

వల్లభనేని వంశీకి ఇప్పటికే మెడచుట్టూ కేసుల ఉచ్చులు ఉన్నాయి. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించిన కేసు ఒక్కటే అయితే.. ఆయనకు కాస్త తేలిగ్గానే ఉండేదేమో. కానీ, ఆ కేసును మానిప్యులేట్ చేయడానికి దళితయువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి నిర్బంధించిన వ్యవహారం.. ఆయనను ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్నిసార్లు బెయిలు పిటిషను వేసినా సరే.. ప్రతిసారీ కొట్టివేస్తుండడాన్ని గమనిస్తేనే ఆ కేసు తీవ్రత అర్థమవుతుంది. ఒక కేసును తారుమారు చేయడానికి చేసిన పాపం గనుక.. ఆయనకు బెయిలు ఇస్తే.. సాక్ష్యాలను తారుమారు చేసేస్తారనే వాదనకే ప్రతిసారీ బలం దక్కుతోంది. ఆ రెండు కేసుల్లోనే కూరుకుపోయి ఉన్న వంశీ.. తాజాగా బెదిరింపులతో భూకబ్జాలకు పాల్పడిన వివాదంలో చిక్కుకున్నారు.

వంశీ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో తన భూవివాదాన్ని పరిష్కరిస్తానని పిలిపించి, తన బినామీల పేర్ల మీద ఆ భూమిని రాయించుకున్నారంటూ విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర కృష్ణమూర్తి, సీతామహాలక్ష్మి దంపతులు ఇటీవల గన్నవరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇందులో వల్లభనేని వంశీ ఏ1 నిందితుడుగా ఉన్నారు. తనను పోలీసులు అక్రమంగా అరెస్టుచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉన్నదని కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వాలని వంశీ విజయవాడ 12వ ఏడీజే కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే మరో తీవ్రమైన కేసులో అరెస్టు అయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వంశీ ఆ కేసునుంచి విడుదల కాకుండా అరెస్టు అయ్యే అవకాశమే లేదని, కాబట్టి ఈ వాదనకు బలం లేదని కోర్టు కొట్టేసింది. మరో కేసులో వంశీకి బెయిలు వచ్చిందని ఆయన న్యాయవాది పేర్కొనగా.. రెండు కేసులూ వేర్వేరు అయినప్పుడు ఆ కోర్టు ఇచ్చిన దానికి తాము కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

తమాషా ఏంటంటే.. జరిగిన దందానే.. భూమిని లాక్కుని బినామీల పేరిట పెట్టడంకాగా, డాక్యుమెంట్లలో ఎక్కడా వంశీ పేరు లేదుగనుక, ఆయనకు బెయిలు ఇవ్వాలని వాదించారు. కానీ తెరవెనుక అసలు సూత్రధారి వంశీనే గనుక, అసలు సంగతి తేలాలంటే వంశీని కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసుల తరఫున వాదించారు. ఇలాంటి తీవ్రమైన కేసుల్లో ముందస్తు బెయిలు ఇవ్వలేం అంటూ కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. 

Related Posts

Comments

spot_img

Recent Stories