పేదల జీవితాలకోసం నిర్దిష్టమైన వ్యవస్థ!

దార్శనిక నేత చంద్రబాబునాయుడు తన 4.0 ప్రభుత్వంలో  చేసినటువంటి పీ4 అనే ఆలోచనే ఎంతో విప్లవాత్మకమైనది. రాష్ట్రంలో సామాజిక ముఖచిత్రాన్ని కొన్నేళ్ల వ్యవధిలో  గణనీయంగా మార్పు చేసే అద్భుతమైన ఆలోచన అది. అలాంటి కొత్త ఆలోచన పీ4ను మరింత లోపరహితంగా, పటిష్టంగా అమలు చేసేందుకు చంద్రబాబునాయుడు ఒక నిర్దిష్టమైన వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నారు. పీ4 అమలు కోసం ఏర్పాటుచేసే రాష్ట్రస్థాయి సొసైటీకి ముఖ్యమంత్రి ఛైర్మన్ గా, డిప్యూటీ ముఖ్యమంత్రి వైఎస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. సీఈవో, డైరక్టర్, వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, టెకీల బృందం, ప్రోగ్రాం బృందం, వింగ్ బృందం ఉంటాయి.
సాయం అందుకోగల లబ్ధిదారులైన బంగారు కుటుంబాల ఎంపిక దగ్గరినుంచి , వారికి సాయం చేసి ఆదుకునే మార్గదర్శుల ఎంపిక వరకు అన్ని వ్యవహారాలను ఈ నిర్దిష్ట సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. పైగా ఈ సొసైటీ పంచాయతీల వరకు దశలవారీగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది.  రాష్ట్రస్థాయి సొసైటీ  సీఎం ఛైర్మన్ గా పనిచేసినట్టే.. జిల్లా స్థాయి కమిటీకి మంత్రి ఛైర్మన్ గా, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఛైర్మన్ గా ఉంటారు. గ్రామ వార్డు విభాగాల్లో  సచివాలయాలకు  పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఆ బాధ్యతలు చూస్తారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు మార్గదర్శులను గుర్తించి.. వారు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా బాధ్యత చూస్తారు. దాతలు ఎవరు? ఎంత మొత్తం ఇచ్చారు? ఇంకెంత సాయం బంగారు కుటుంబాలకు అవసరం అనే అన్ని రకాల వివరాలను వెబ్ సైట్ లో పెడతారు. దీనివల్ల పథకం అమలు పారదర్శకంగా ఉంటుందని భావిస్తున్నారు. పీ4 వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నిత్యం ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. ఆ వ్యవస్థపై అటు దాతలు, ఇటు లబ్ధిదారులైన బంగారు కుటుంబాలు.. మొత్తం అందరిలోనూ నమ్మకం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

ఈ పీ4 పథకం ద్వారా ఆగస్టు 15 లోగా 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు పనిచేస్తోంది. బంగారు కుటుంబాలకు ఆన్ లైన్ లో కూడా సాయం అందించగల ఏర్పాట్లు చేస్తున్నారు.

పేదల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడం అనేది పీ4 కార్యక్రమ లక్ష్యం. సమాజంలో సంపన్నులు.. తిరిగి సమాజానికి రుణం చెల్లించుకునే కార్యక్రమంలాగా దీనిని రూపొందించారు. పేదల ఎంపిక బాధ్యత లోపాలు లేకుండా సాగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. మొత్తానికి కేవలం ధనవనరుల రూపేణా లోటు వల్ల ఎదగలేకపోతున్న పేద కుటుంబాలకు ఈ పీ4 చాలా పెద్ద మేలుచేస్తుందని అందరూ నమ్ముతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories