జగన్మోహన్ రెడ్డికి ఎంతటి అహంకారం అంటే.. తాను అధికారంలో లేకపోయినా సరే.. తన మాట చెల్లుబాటు కావాలనే పంతం. తన మనుషులు నిర్ణయాత్మక స్థానాల్లో ఉంటే.. వారిద్వారా.. నిబంధనలకు విరుద్ధంగా అయినా దూకుడు ప్రదర్శించవచ్చునని అతివిశ్వాసం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అహంకారంతో వేసిన అటువంటి అడుగులకు ఇప్పుడు చెంపదెబ్బ తగిలింది.
ఏది కరెక్టో.. ఏది తప్పూ తరువాత.. ముందు ఆయన ప్రదర్శించిన అహంకారానికి మాత్రం ఇది గొడ్డలిపెట్టు అని చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందుకూరి రఘురాజు మీద ఈ ఏడాది జూన్ లో అనర్హత వేటు వేయించారు. అయితే హైకోర్టు తీర్పును అనుసరించి.. ఇవాళ ఆయన ఎమ్మెల్సీగా సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఇది జగన్ పోకడలకు చెంపదెబ్బ కాక మరేమిటి అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇందుకూరి రఘురాజు.. విజయనగరం జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గతంలో వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రామిస్ చేసిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సమయంలో ఆ మాట నిలనబెట్టుకోలేదు. దీంతో ఆయన భార్య వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిపోయారు. రఘురాజు అనుచరులు కూడా పలువురు తెలుగుదేశంలో చేరారు. అంతే తప్ప ఇందుకూరి రఘురాజు పార్టీ మారినట్టుగా ఒక్క ఆధారం కూడా లేదు. కాకపోతే.. జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కక్ష కట్టారు.
తన మాట మీరి తెలుగుదేశానికి సహకరించారని ఆయనకు కోపం వచ్చింది. ఎటూ మండలిలో ఛైర్మన్ స్థానంలో ఉన్నది వైసీపీకి చెందిన మోసేన్ రాజే కావడంతో అటునుంచి నరుక్కు వచ్చారు. ఆయన ద్వారా రఘురాజుపై అనర్హత వేటు వేయించారు. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టు నోటిఫై కూడా చేయించారు. దీంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. జగన్ అంతే దూకుడుగా అభ్యర్థిని కూడా ప్రకటించేశారు.
కానీ.. అసలు రఘురాజుమీద అనర్హత వేటు వేయడంలో కనీస నిబంధనలు పాటించలేదు. ఆయనను విచారించకుండానే వేటు వేశారు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లి జగన్ అహంకారంపై విజయం సాధించారు. ఆయనపై అనర్హత వేటును హైకోర్టు కొట్టేసింది. తీరా ఇప్పుడు ఇందుకూరి రఘురాజు సభ్యత్వాన్ని శాసనమండిలిలో పునరుద్ధరించారు. మోసేన్ రాజు మరోసారి ఆయన మీద విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మరి ఎలాంటి ఆధారాలూ లేని నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.