అధికారం తమ చేతుల్లో ఉన్నది కదాని.. అడ్డదారుల్లో గద్దెమీదికి వచ్చారు. కానీ.. ఆ పదవి యొక్క గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించడం వారి వల్ల కాలేదు. కొందరు అడ్డగోలుగా నిబంధనలను అతిక్రమించారు. కొందరు ఏకంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత ఖజానా నింపుకోవడానికి దోచుకోవడం ఒక హక్కుగా భావించారు. తమకు జగనన్న అండదండలుంటాయనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మొత్తానికి అలాంటి వారిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంటికి పంపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మేయర్, ఒక మునిసిపాలిటీ ఛైర్మన్ లను పదవినుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ నివేదిక నిర్ధరించడంతో కడప నగర మేయర్ సురేష్ బాబు మీద అనర్హత వేటు పడింది. కడప నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన కాంట్రాక్టు సంస్థకే కట్టబెట్టినట్టు విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. అక్కడ పనులను వర్ధిని కన్‌స్ట్రక్షన్స్ ద్వారా చేపట్టారు. ఆ కంపెనీకి డైరక్టర్లుగా మేయర్ సురేష్ కొడుకు అమరేష్, భార్య జయశ్రీ ఉన్నారు. పురపాలక చట్టం నిబంధనలను అతిక్రమించినందుకు పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజ్ రెడ్డినుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ మేయరుకు కూడా కమిషనర్ లేఖ రాశారు. మునిసిపల్ శాఖ కార్యదర్శి వద్ద సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చారు. మొత్తానికి విజిలెన్స్ నివేదిక ఆధారంగా 36 లక్షల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడినట్టు తేలడంతో.. మేయర్ సురేష్ బాబు మీద వేటు వేస్తూ ముఖ్యకార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల మునిసిపల్ ఛైర్మన్ కిశోర్ ను పదవినుంచి తొలగిస్తూ మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఛైర్మన్ పదవిని దుర్వినియోగం చేశారని, మునిసిపల్ చట్టం ఉల్లంఘించారని, అనుమతి లేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్ భేటీలకు గైర్హాజరయ్యారని ఆయన మీద ఆరోపణలు రావడంతో తొలగించడం జరిగింది.
కడప మేయర్ అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ఇటీవలి కాలంలో పేరు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కడప ఎమ్మెల్యేతో అనేక పర్యాయాలు ఆయన తగాదా పడ్డారు. అనుచితంగా వ్యవహరించారు. ఇద్దరి మధ్య రాజకీయ వైరం పలుమార్లు రచ్చకెక్కింది. అప్పటినుంచి ఆయన మీద అవినీతి ఆరోపణలు గురించి చర్చ జరుగుతుండగా.. ఎట్టకేలకు అవినీతికి సంబంధించిన పక్కా ఆధారాలతో విజిలెన్స్ నివేదిక ప్రకారం ఆయన మీద వేటు వేసినట్టు తెలుస్తోంది.