కుప్పం ఓటరు కసిగా వచ్చి ఓటేశాడు!

రాష్ట్రంలో అత్యధికంగా ఓటింగ్ నమోదైన నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ 85.87% ఓటింగ్ నమోదు అయింది. కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇది ఒక రికార్డు. అయితే ఇంత భారీ ఓటింగ్ అనేది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది.. అని మనం ఆలోచించాలి. సాధారణంగా ఓటింగ్ శాతం పెరగడం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తుంటారు. కుప్పం విషయానికి వస్తే ఈ భారీ ఓటింగ్ కూడా వ్యతిరేకతకు నిదర్శనమా అని మనం ఆలోచించాలి.

అదే నిజమైతే వ్యతిరేకత ఎవరిమీద? ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు మీదనా? లేదా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదనా? అనేది కూడా ఆలోచించాలి.
స్థానికంగా ప్రజలను సంప్రదించి వివరాలు సేకరించినప్పుడు తెలిసివస్తూన్న వాస్తవాలు ఇంకోరకంగా ఉంటున్నాయి.

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ను ఓడించే స్థాయిలో తమ పార్టీ బలపడాలి అనే ఉద్దేశంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలుగా ఒక అరాచకత్వాన్ని అక్కడ  నెలకొల్పింది. చిట్టచివరకు అధికార పార్టీ నాయకులు ఎంతగా దిగజారారంటే.. తెలుగుదేశం నాయకులు తమ సొంత డబ్బుతో పేద ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టడానికి అన్న క్యాంటీన్లని ఏర్పాటు చేస్తే.. వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసేసారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా ఎక్కడా కనిపించకూడదు అన్నట్లుగా చెలరేగిపోయారు.

ప్రత్యేకించి గ్రామ సర్పంచ్ స్థానాలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సమయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దురాగతాలకు అంతులేకుండా పోయింది. తెలుగుదేశం తరఫున నామినేషన్ వేయడానికి కూడా ఎవరూ రాకుండా అందరిని భయభ్రాంతులకు గురి చేశారు. కిడ్నాపులు చేశారు. బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి తెలుగుదేశం వారిని బలవంతంగా తమ పార్టీలో చేర్చుకున్నారు. కుప్పం మునిసిపాలిటీని తమ పార్టీ వశం చేసుకున్నారు. కుప్పంలో పార్టీని మరింతగా బలోపేతం చేసి.. ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి అక్కడి నాయకుడికి ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు.

అయితే ఐదేళ్లపాటు కుప్పం నియోజకవర్గ మీద స్పెషల్ ఫోకస్ తో సాగించిన అరాచకత్వాన్ని ప్రజలు మౌనంగా గమనిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పర్యటించినా.. ఎప్పటిలాగానే ఆయనకు ఆదరణ దక్కుతూ వచ్చింది. స్థానిక సంస్థల ఫలితాలు మాత్రం తెలుగుదేశానికి వ్యతిరేకంగా నమోదు అయ్యాయి.

అయితే అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయానికి పోలీసింగ్ వ్యవస్థ కొంత నిష్పాక్షికంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు వెల్లువలాగా తమ కసి తీర్చుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.. అనేది స్థానికంగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం. ఐదేళ్లపాటు చేసిన అరాచకాలు బుద్ధి చెప్పాలని ఉద్దేశంతోనే ఓటర్లు వెలువలాగా తరలివచ్చారని అంటున్నారు. ఇక్కడి ఓట్లు చంద్రబాబు నాయుడుకి గతంలో తగ్గిన మెజారిటీని భర్తీ చేసేలాగా ఈసారి గొప్ప మెజారిటీ ఇవ్వబోతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం పట్ల కేవలం వ్యతిరేకత మాత్రమే కాదు కసితో కుప్పం ప్రజలు జిల్లాలో అత్యధిక ఓటింగ్ లు నమోదు చేశారని అక్కడి వారు చెబుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories