టెక్నాలజీ అంటేనే రోజురోజుకూ రూపురేఖలు మారిపోతున్న అత్యాధునికర రంగం. జీవితం వెనుకబడకుండా మారిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ముందుకు సాగుతూ ఉండాలంటే.. మనం కూడా నిరంతరం అప్ డేట్ అవుతూ ఉండాలి. లేకపోతే ఆధునిక సమాజంలో మనుగడ కష్టం. అదే సిద్ధాంతం ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన నేరాలను కట్టడి చేయడానికి కూడా వర్తిస్తుంది. సోషల్ మీడియా సంబంధిత సైకోలను కట్టడి చేయడానికి కూడా వర్తిస్తుంది. సోషల్ మీడియాలో రోజురోజుకు కొత్త, భిన్నమైన పోకడలతో చెలరేగుతున్న నేరగాళ్లు, దుర్మార్గులకు అడ్డుకట్ట వేయాలంటే పటిష్టమైన చట్టాలు ఉండాలని అందరూ చెబుతుంటారు. అయితే ఒక చట్టాన్ని రూపొందించి దానిని అమలులో పెట్టే లోగా ఆ చట్టంలో నిర్దేశించిన విధివిధానాలను మీరి, వాటి పరిధిలోకి రాకుండా ఎలాంటి తప్పుడు పనులు చేయవచ్చునో కొత్త మార్గాల అన్వేషణ కూడా జరుగుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయడానికి కూడా ఎప్పటికప్పుడు నవీకరింపబడుతూ ఉండే చట్టాల అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది అని చెప్పాలి.
సోషల్ మీడియా నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో తేల్చేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఐటీ మంత్రి నారా లోకేష్, హోమ్ మంత్రి వంగలపూడి అనిత, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి ఉంటారు. సోషల్ మీడియా సైకోలను అరికట్టడానికి ప్రస్తుతం ఎలాంటి చట్టాలు ఉన్నాయో.. దేశవ్యాప్తంగానూ, వివిధ రాష్ట్రాలలోనూ ఎలాంటి ఏర్పాట్లు అమలు అవుతున్నాయో మీరు అధ్యయనం చేస్తారు. తదనగుణంగా రాష్ట్రంలో సోషల్ మీడియా వికృత పోకడలను నియంత్రించడానికి ఏ చర్యలు తీసుకోవాలో విధివిధానాలను రూపొందిస్తారు. ఇది చాలా అవసరమైన పరిణామంగా మనం భావించాలి.
ఎందుకంటే సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు ఒక నిత్యావసర సరుకు లాగా వాడుకోవడం ప్రారంభించిన తర్వాత ఆ రంగంలో వికృత పోకడలు మితిమీరిపోతున్నాయి. చేతికి మట్టి అంటకుండా ఎవరు ఏ పని చేస్తున్నారో బోధపడ్డం లేదు. ఆచూకీ తెలియనివ్వకుండా తమ ప్రత్యర్ధుల మీద అనుచితమైన రీతిలో బురద చల్లడానికి, వారిని బదనాం చేయడానికి అత్యంత అసహ్యకరమైన జుగుప్సాకరమైన విమర్శలు చేయడానికి ఈ సోషల్ మీడియా ఒక సులువైన వేదికగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా అనధికారికంగా వేతనం చెల్లించి ఉద్యోగుల లాగా కొన్ని వందల వేల మంది యువతను ఏర్పాటు చేసుకుని.. వారిని సైకోలుగా తయారు చేస్తూ అందుకు అవసరమైన తర్ఫీదు ఇస్తూ.. వారిద్వారా రాష్ట్ర ప్రజల మెదడులలోకి విషాన్ని వ్యాపింప చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజకీయాలలో ప్రధానంగా ఇది ఒక నిత్య కృత్యమైపోయింది. దీనిని సమర్థంగా నియంత్రించడం సామాజిక అవసరం అనే చెప్పాలి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం అందుకు అవసరమైన మెరుగైన సూచనలను తమ నివేదికలో పొందుపరుస్తుందని, తద్వారా ఆధునిక సోషల్ మీడియా సమాజంలో సుహృద్భావ వాతావరణం ఏర్పడగలదని మనం అనుకోవచ్చు. సోషల్ సైకోలకు సరైన రీతిలో ముకుతాడు వేస్తే ఇది అసాధ్యం కాదని తెలుసుకోవాలి.