మాట నిలబెట్టుకోలేని జగన్‌కు కీలకనేత గుడ్‌బై!

జగన్మోహన్ రెడ్డి చీటికి మాటికి తన గురించి తాను ఒక డప్పు కొట్టుకుంటూ ఉంటారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పుకుంటూ అయిదేళ్లు గడిపారు. కానీ కాస్త లోతుగా గమనించినప్పుడు.. ఆయన మాట తప్పిన సందర్భాలు, మడమ తిప్పిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. పార్టీని నమ్ముకుని ఎంతో సిన్సియర్ గా ఉన్న నేతలకు కూడా.. ఆయన రిక్తహస్తం చూపించడం మాత్రమే కాదు.. వారికి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకుండా.. అవకాశవాద రాజకీయాలు ప్రకటించిన సందర్భాలున్నాయి. ఏ రోటికాడ ఆ పాట పాడినట్టుగా.. వారి ముఖప్రీతికి మాట ఇచ్చి పబ్బం గడుపుకోవడం ఆ తర్వాత వారిని పక్కన పెట్టడం జగన్ చాలామంది నేతలతో చేశారు. అలాంటి అవమానాలను ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లూ మౌనంగా భరించిన, ఆయన దిగిపోయిన తర్వాత కూడా.. ఇన్నాళ్లూ మౌనంగా గడిపిన కీలక నాయకుడు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టారు. కేవలం పార్టీకి మాత్రమే కాదు.. జగన్ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా ప్రకటించేశారు. గుంటూరు జిల్లా కీలక నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీకి పదవికి కూడా రాజీనామాను ప్రకటించారు.

మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు అండగా ఉన్న నాయకుడు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2019 వచ్చేసరికి మర్రిని పక్కన పెట్టిన జగన్, అప్పుడే పార్టీలో చేరిన విడదల రజనికి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సందర్భంగా.. జరిగిన ఎన్నికల ప్రచారంలో మర్రి రాజశేఖర్ ను తన కేబినెట్ లో మంత్రిని చేస్తానంటూ బహిరంగంగానే ప్రకటించారు. మాటతప్పను అని చెప్పుకునే జగన్ మాటలను మర్రి అభిమానులు కూడా నమ్మి, రజనినిన గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. పునర్ వ్యవస్థీకరణ సమయంలో ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే జగన్ అలా చేస్తున్నట్టు అందరూ భావించారు గానీ.. అది కూడా జరగలేదు.

తీరా 2024 ఎన్నికల్లో టికెట్ ఆశిస్తే అదికూడా దక్కలేదు. ఎన్నికల్లో పరాభవం తర్వాత.. పార్టీ ఇన్చార్జి పదవిని కూడా తిరిగి విడదల రజనికే జగన్ కట్టబెట్టారు. ఈ పరిణామాలన్నీ మర్రి రాజశేఖర్ కు తీవ్ర అవమానకరంగా అనిపించాయి. ఈ అవమానాలను భరిస్తూనే ఆయన ఇన్నాళ్లూ పార్టీలో మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు. మండలిలో రాజీనామా చేసిన వైసీపీ సభ్యుల సంఖ్య అయిదుకు చేరింది. ఇప్పటికే పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. పార్టీకి విశ్వసనీయులైన నాయకులు కూడా ఒక్కరొక్కరుగా వీడి వెళ్లిపోతుండడం.. కార్యకర్తల్లో ఆందోళన పెంచుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories