తెలుగులో డెవిల్ అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు నందమూరి కల్యాణ్ రామ్. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తన 21 వ సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమా సెట్ లో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. కొంతకాలం క్రితమే జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథలో భాగంగా ఒక సీబీఐ ఆఫీస్ లో కొంత షూట్ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే సీబీఐ ఆఫీస్ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. సుమారు పది రోజుల పాటు ఈ సీబీఐ ఆఫీస్ సెట్ లో షూటింగ్ చేయాలని చిత్ర బృందం భావించింది. అప్పటికే 9 రోజుల షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఒకరోజు రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సెట్టు మొత్తం అగ్నికి ఆహుతి అయినట్లుగా తెలుస్తోంది. 9వ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత ఎనిమిది గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని అయితే ఈ విషయం సుమారు రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో సినిమా యూనిట్ దృష్టికి వచ్చిందని వెళ్లేలోపు దాదాపు మొత్తం కాలిపోయిందని తెలుస్తోంది.
ఇక ఈ అగ్ని ప్రమాదం కారణంగా సినిమా యూనిట్ కి దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్ల తెలుస్తుంది. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ నెలలో పట్టాలెక్కింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కథానాయికగా సాయి మంజ్రేకర్ చేస్తుంది. విజయశాంతి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచే ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపారు.