వేంకటేశ్వరస్వామి మీద భక్తితో భక్తులు తిరుమల క్షేత్రానికి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. స్వామి వారి పట్ల భక్తితో ఒక భక్తుడు మొక్కు తీర్చుకోవడానికి తలనీలాలు సమర్పించుకోవాలని అనుకుంటాడు. తిరుమలలో ప్రధానమైన కల్యాణ కట్ట ఒక్కటే కాదు.. మినీ కల్యాణ కట్టలు కూడా చాలా ఉంటాయి. పెద్ద కల్యాణ కట్ట వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఊహతో ఒక మినీ కల్యాణకట్ట వద్దకు వెళ్తాడు. తీరా వెళ్లాక అక్కడే రద్దీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో చోటకు వెళ్తాడు.. అక్కడ కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తీరా ప్రధానమైన కల్యాణ కట్ట వద్దకు వెళితే.. అక్కడ రద్దీ చాలా తక్కువగా హాయిగా ఉంటుంది. అయ్యో ఊహల్లో అంచనాలు వేసుకోకుండా.. ముందే ఇక్కడకు వచ్చి ఉంటే బాగుండేదే అని ఆ భక్తుడు అనుకుంటాడు. అలాగే ఏ కల్యాణ కట్ట వద్ద ఏయే సమయాల్లో ఎంతెంత రద్దీ ఉన్నదో తెలుసుకునే సదుపాయం ఉంటే బాగుంటుంది కదా.. అది చూసుకుని.. తొలి ప్రయత్నంగానే రద్దీ తక్కువ ఉన్న చోటకు వెళ్తాం కదా అని అనుకుంటాడు.
సరిగ్గా అలాంటి అత్యాధునిక సాంకేతికతను భక్తులకు అందుబాటులోకి తేనున్నది టీటీడీ. తిరుమలలో ప్రధానమైన ఏయే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంత రద్దీ ఉంటున్నదో ఏ సమయంలోనైనా భక్తులు చిటికెలో తెలుసుకోగలిగేలాగా.. గూగుల్ ఏఐ సాయంతో సరికొత్త సాంకేతికత విధానాలను అందుబాటులోకి తేనుంది. రాష్ట్రంలో దాదాపుగా అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఏఐ జోడింపు ద్వారా మెరుగు పరచడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అదే ఏఐ సాంకేతికను తిరుమలేశుని సేవల్లో కూడా వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు వారం పదిరోజుల్లోగా టీటీటీ- గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది. గూగుల్ ఈ సాంకేతిక సేవలను ఉచితంగానే టీటీడీకి అందించనుంది.
తిరుమలకు ఏయే వేళల్లో ఎంత మంది భక్తులు వస్తున్నారు.. అనేది కూడా ఎప్పటికప్పుడు గూగుల్ ఏఐ ట్రాక్ చేస్తుంటుంది. ఏ సీజన్ లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు.. లాంటి అన్ని వివరాలు టీటీడీకి తెలుస్తాయి. దీనివల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంటారు.
అలాగే భక్తులకు తిరుమలకు సంబంధించిన అనేక రకాల సమచారాన్ని అందించడానికి కూడా ఈ గూగుల్ ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. దర్శనానికి పాటించాల్సిన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా ఏఐ ద్వారా భక్తులు తెలుసుకోవచ్చు. దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారి స్థానిక భాషల్లోనే ఈ సమాచారాన్ని అందించడానికి ఏఐ సహకరిస్తుంది.
మొత్తానికి గూగుల్ ఏఐ సేవలు.. తిరుమలల భక్తులకు ఎదురయ్యే అనుభూతిని పూర్తిగా మారుస్తాయని, ఎలాంటి చికాకులు లేకుండా దైవదర్శనం చేసుకోగలిగే పరిస్థితిని కల్పిస్తాయని అంతా అనుకుంటున్నారు.