క్షేత్రస్థాయిలో కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా కూటమి పార్టీల మధ్య లుకలుకలు పుట్టించాలనే కుట్రలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ వంతు ప్రయత్నాలను చేస్తూ వస్తోంది. ఇలాంటి కుట్రలకు అమాయకంగా లొంగుతున్న వారికి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టమైన హెచ్చరిక చేశారు. కూటమి పార్టీల మధ్య ఐక్యతను భగ్నం చేయడానికి పార్టీలో ఎవ్వరు ప్రయత్నించినా సరే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. పదవులకోసం కార్యకర్తలు వేచి ఉండాలని హితవు చెప్పారు.
ఎవరు ఎక్కువ ఓర్పుగా వేచి ఉండగలిగితే వారికే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఇందుకు పదిహేనేళ్లుగా ఎలాంటి పదవి ఆశించకుండా రాజకీయాల్లో ప్రజలకోసం పనిచేస్తూ వచ్చిన పవన్ కల్యాణ్ మంచి ఉదాహరణ అని ఆయన చెప్పారు. విశాఖలో నాగబాబు మాట్లాడిన మాటలు కూటమి ఐక్యతను మరింత పదిలంగా కాపాడేవిధంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పందేరం సీజన్ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టలేకపోయింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్ది.. పరిపాలనను గాడిలోకి తీసుకురావడానికే వారికి ఈ సమయం సరిపోయింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ కొంత వరకు జరిగినప్పటికీ.. ఇంకా వందల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేవలం తెలుగుదేశంలో మాత్రమే కాకుండా కూటమి పార్టీల్లో పదవుల మీద ఆశలు పెంచుకుంటున్న వాళ్లు ఎక్కువవుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ వల్లనే కూటమి గెలిచిందనే భావన ఏర్పడుతోంది.
అందువల్ల తమకు కీలక పదవులు కావాలని అడుగుతున్నారు. మూడు పార్టీలు ఐక్యంగా ముందుకు అడుగులు వేయాల్సిన ప్రస్తుత తరుణంలో.. ఏ ఒక్కరూ కూడా ఎక్స్ ట్రాలు చేయరాదని పవన్ కల్యాణ్ పదేపదే హితబోధలు చేస్తున్నప్పటికీ.. జనసైనికులు పలుచోట్ల పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారందరికీ నాగబాబు విశాఖ వేదికగా స్పష్టమైన హెచ్చరిక చేశారు. అర్హత ఉన్న అందరికీ పదవులు దక్కుతాయని, కానీ దుర్మార్గమైన పాలనను అంతమొందించడానికి కూటమిగా జట్టుకట్టిన నేపథ్యంలో.. పదవులు రాని వారు ఓర్పుతో వేచి ఉండాలని అన్నార.
జగన్ మీడియా గానీ, వైసీపీ నాయకులు గానీ.. కూటమి ఐక్యత పరంగా పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టడానికి పదేపదే ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ చాలా గొప్ప సంయమనం పాటిస్తున్నారు. విశాఖలో జరిగిన పార్టీ కార్యక్రమంలో నాగబాబులో కూడా ఇలాంటి సంయమనమే కనిపించింది. కూటమి బంధం ఏర్పడ్డంలో పవన్ కల్యాణ్ కృషి చాలా ఉందని, అలాగే, కూటమికి సారథ్యం వహించి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబునాయుడు మార్గదర్శనం ముఖ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే ఇరవయ్యేళ్లపాటు జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అంటున్న నాగబాబు.. కార్యకర్తలు కాస్త ఓపిగా వేచి ఉంటే.. అందరికీ పదవులు తప్పకుండా దక్కుతాయని చెబుతుండడం ఒక నమ్మకాన్ని కలిగిస్తోంది.