చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను ఓడిస్తే గనుక వారు రాష్ట్రంలోనే ఉండరు. రాష్ట్రంలో వారికి సొంత ఇళ్లు కూడా లేవు. వారు వెళ్లి హైదరాబాదులో కూర్చుంటారు.. అంటూ ఎన్నికల ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్ని ఆరోపణలు చేశారో లెక్కేలేదు. ఇప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉంటే.. తాను ఓడిపోతే ఎలాంటి పనిచేస్తాడో.. అదే బుద్ధిని తన ప్రత్యర్థులకు ఆపాదించి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసినట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఇప్పటిదాకా మెజారిటీ సమయం జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు యలహంక ప్యాలెస్ లోనే గడుపుతున్నారు. మధ్యలో ఖాళీ దొరికినప్పుడు ఒక ట్వీట్ పెట్టడం, అంతకంటె కాస్త ఎక్కువ ఖాళీ దొరికితే తాడేపల్లికి రావడం చేస్తున్నారు.
ఇప్పటికి ఏడుసార్లు బెంగుళూరు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అక్కడినుంచి శనివారం పులివెందుల రానున్నారు. రెండురోజులు అక్కడే ఉంటారు. 2వ తేదీ సోమవారం వైఎస్సార్ వర్ధంతి కావడంతో ఇడుపులపాయంలోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. 4వ తేదీ ఆయన లండన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యలో అంటే.. యలహంక టూ లండన్ వయా ఇడుపులపాయ రూట్ మ్యాప్ లో గ్యాప్ దొరికిన ఒకరోజు మాత్రం ఆయన తాడేపల్లిలో గడిపే అవకాశం ఉంది.
నిజానికి పార్టీ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. చట్టసభల పదవులను కట్టబెట్టిన వారు కూడా.. ఈ పార్టీ మాకొద్దు బాబోయ్ అంటూ పదవులను కూడా వదులుకుని రాజీనామాలు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేత దగ్గరుండి వ్యవహారాలు చక్కబెట్టే బాధ్యత చూడాలి. మరికొందరు నాయకులు పార్టీని వీడి వెళితే గనుక.. అలాంటి ప్రభావం కార్యకర్తలు, శ్రేణులపై కూడా పడుతుందని.. కిందిస్థాయి వారు కూడా మూకుమ్మడిగా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని పార్టీలో కొందరు సీనియర్లు హెచ్చరిస్తున్నప్పటికీ జగన్ పట్టించుకోవడం లేదని.. నిర్లిప్తంగా ఉంటున్నారని తెలుస్తోంది.
ప్రజలు ఓడించినందుకు జగన్మోహన్ రెడ్డిని పార్టీని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కూడా కష్టమని పలువురు వాపోతున్నారు.