వాస్తవాలు చెప్పారని వారిని జైలుకు పంపించే కుట్ర!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన సేవ కోసం ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్లు! ఆయన ప్రాపకంలో పనిచేయవచ్చునని అనుకున్నారే గానీ.. తమను అడ్డగోలుగా వాడుకోవడానికే, ఊహించలేనంత అక్రమాలకు తమను ముసుగుగా వాడుకోవడానికే పిలిపించారని వారు ఊహించలేకపోయారు. తాము కూడా లబ్ధి పొందినప్పటికీ.. జగన్ అరాచకాల్లో వాళ్లు భాగంగా మారిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. అక్రమాల చిట్టా బయటకు తీయడంతో.. వారి మీద కూడా కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల విచారణలో.. గత ప్రభుత్వకాలంలో జరిగిన అరాచకాలను వారు తమకు తెలిసిన మేర పూసగుచ్చినట్టు చెప్పేశారు. అరాచకాలకు అసలు మూలపురుషులు అయిన వైసీపీ నాయకుల మెడకు ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు అధికారులను వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు టార్గెట్ చేస్తున్నాయి. వారిద్దరినీ కూడా అరెస్టు చేసి జైలుకు పంపించాలనేంత స్థాయిలో వారికి వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తున్నారు. ప్రచారం సాగిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. జగన్మోహన్ రెడ్డి అండ్ కో మూడున్నర వేల కోట్లరూపాయలకు పైగా ప్రజాధనాన్ని ముడుపులుగా కాజేసిన కుంభకోణంలో ముఖ్యమైన పాత్రధారుల్లో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ కూడా ఉన్నారు. మొత్తం వసూళ్ల నెట్వర్క్ ను నడిపించిన రాజ్ కెసిరెడ్డి ఏ1 కాగతా, ఏ2గా అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి , ఏ3గా అప్పటి ఎక్సయిజ్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ ఉన్నారు. సిట్ ఈ కుంభకోణంపై కేసులు నమోదు చేసినప్పటినుంచి రాజ్ కెసిరెడ్డి పరారీలోకి వెళ్లగా, తొలుత ఈ ఇద్దరినే విచారించింది. మద్యం పాలసీకి రూపకల్పన విజయసాయిరెడ్డి ఇంట్లో ఏ రకంగా జరిగిందనే దశ నుంచి తమకు తెలిసిన వాస్తవాలన్నీ వారు సిట్ కు నివేదించారు. కొత్త వివరాలు అనేకం, అనేకమంది పాత్రధారుల పేర్లు సిట్ కు తెలిసి వచ్చాయి. కేసు ఇవాళ ఈ దశలో పురోగతిలో ఉన్నదంటే.. ఆరంభదశలో వారిద్దరు ఇచ్చిన వివరాలే కీలకం.

జగన్ దళాలు ఆ ఇద్దరి మీద ఇప్పుడు పగబట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాయి. ఆ ఇద్దరూ ఏసీబీకోర్టులో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా సాంకేతిక కారణాల వల్ల కోర్టు తిరస్కరించింది. అప్రూవర్ లుగా మారే అవకాశం ఉన్నందున, సాంకేతికంగా ముందస్తు బెయిలు ఇవ్వడం కుదరదని ఏసీబీ కోర్టు పేర్కొంది. అరెస్టు అయి, తర్వాత అప్రూవర్ గా మారినా కూడా, అప్పుడు బెయిలు లభించడానికి అవకాశం ఉంటుంది. కానీ.. కోర్టు తీర్పు నేపథ్యంలో అర్థసత్యాలను మాత్రమే ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవపట్టిస్తూ.. ట్రయల్ పూర్తయ్యే వరకు జైల్లోనే ఉంచితీరాలన్నట్టుగా సాక్షి ప్రచారం చేస్తున్నది. సిట్ పోలీసులు తమను బెదిరించి తమతో వారికి కావాల్సినట్టు వివరాలు చెప్పించుకున్నారని, మళ్లీ వాంగ్మూలం ఇచ్చేలా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ లను జగన్ మోహన్ రెడ్డి దళాలు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినట్టుగా గుసగుసలున్నాయి. సాక్షి మీడియాలోనే అలాంటి కథనాలను పుంఖాను పుంఖాలుగా వండి వార్చారు. వాటిని ఖాతరు చేయకుండా ఆ ఇద్దరూ మిన్నకుండిపోయారు. వారు అప్రూవర్ గా మారడం అంటూ జరిగితే గనుక.. అంతిమలబ్ధిదారు జగన్ అనే సంగతి తో సహా.. తమ బండారం మొత్తం బయటకు వస్తుందనే భయం వైసీపీ దళాల్లో ఉంది. అందుకే వారిని కూడా జైలుకు పంపేలా తప్పుడు కథనాలతో ఒత్తిడి తేవాలని ఆలోచిస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories