మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పెద్ది షూటింగ్ ఇప్పుడు పూణే ప్రాంతంలో వేగంగా సాగుతోంది. ఇది గ్రామీణ నేపథ్యంలోని క్రీడల ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండటంతో, ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇద్దరి జోడీ ఎలా ఉండబోతుందో అన్న కుతూహలం కూడా ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.
ఇక పెద్ది తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పటికే రంగస్థలంతో భారీ విజయం సాధించినందున, ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలవడం సినిమాప్రేమికుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ 2026 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పెద్ది చిత్ర పనులు వచ్చే జనవరి వరకు కొనసాగుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత చరణ్ పూర్తిగా సుకుమార్ మూవీపై దృష్టి పెట్టనున్నాడు.