రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల నకిలీ మద్యం తయారవుతున్న సంఘటనలు వెలుగుచూడడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పండగలాగా కలిసి వచ్చిన అవకాశంగా కనిపిస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ గొడవనుంచి ఎడ్వాంటేజీ తీసుకున్నారు. స్థాయితో నిమిత్తం లేకుండా.. ప్రతి ఒక్కరూ అదే పాట పాడుతున్నారు. రాష్ట్రమంతా ఉద్యమాలు కూడా చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత రాష్ట్ర రాజకీయ వ్యవహారాలు గురించి తక్కువగా మాట్లాడుతూ వార్తల్లోకి వస్తున్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కూడా తాజాగా నకిలీ మద్యం వ్యవహారం మీద తన అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించడం గమనించాల్సిన సంగతి. రాష్ట్రమంతా నకిలీమద్యం విక్రయిస్తున్నారని, ఏది నకిలీనో ఏది మంచి మద్యమో తెలియని పరిస్థితి ఏర్పడిందని వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని నిందించడానికి అవకాశం దొరికింది కదాని.. రెచ్చిపోతున్న వైవీసుబ్బారెడ్డి జగన్ హయాంలో జరిగిన దారుణాల గురించి ఏమంటారో కదా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
నకిలీ మద్యం తయారు చేస్తూ కొందరు అక్రమ దందా సాగిస్తూన్న మాట వాస్తవం. వారిలో తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉన్న వారిని పార్టీనుంచి సస్పెండ్ చేశారు కూడా. అలాగే.. వారు ఈ దందాను రెండున్నరేళ్లకు పైగా నిరాటంకంగా కొనసాగిస్తున్నట్టు కూడా గుర్తించారు. వారి మీద చర్యలు తీసుకోకపోతే.. అప్పుడు ప్రభుత్వాన్ని నిందించాలి. అలా కాకుండా చర్యలు తీసుకుంటున్నప్పుడు.. ప్రభుత్వాన్ని నిందించడానికి ఎవరికైనా ఏం అర్హత ఉంటుందో అర్థం కాని సంగతి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వైవీ సుబ్బారెడ్డి చెబుతున్న భాష్యం చిత్రంగా ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం వల్ల మాత్రమే అంతా బాగా జరిగిందట. చంద్రబాబునాయుడు ప్రభుత్వం టెండరు ద్వారా ప్రెవేటు వ్యక్తులకు దుకాణాల నిర్వహణ అప్పగించడం వల్ల మాత్రమే ఇలా జరుగుతోందట. అందులో ఏం లాజిక్ ఉన్నదో వైవీకి మాత్రమే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నకిలీ మద్యం పేరుతో దొరికిన వారే.. రెండున్నరేళ్లుగా ఈ దందాలో ఉన్నట్టుగా చెబుతున్నారు. అంటే జగన్ కాలంలో కూడా ఈ వ్యవహారం నడిచినట్టే కదా. అదే సమయంలో మరో తమాషా ఏంటంటే.. ఇప్పుడైనా కేవలం నకిలీ మద్యం వ్యవహారం బయటకు వచ్చింది. జగన్ పరిపాలన కాలంలో.. ఏకంగా కల్తీ మద్యం పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. దాన్ని గురించి ఈ వైవీగానీ, ఇతర వైసీపీ దళాలు గానీ ఏమంటారు? తమ పార్టీ వారైనా సరే.. తప్పు చేస్తే పార్టీనుంచి వెలివేసి.. ఇతర చర్యలు తీసుకుంటున్నారిప్పుడు.. అదే జగన్ పాలనకాలంలో.. దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిపై కూడా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రజలంటున్నారు. వైవీసుబ్బారెడ్డి ఇతరుల్ని నిందించే ముందు.. తమ పార్టీ తమ ప్రభుత్వకాలంనాటి దందాలు ఎలా సాగాయో కూడా గుర్తు చేసుకోవాలని అంటున్నారు.