పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా విడుదలైన ‘ఓజీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అభిమానులు ఎప్పటినుంచో ఆయనను పవర్ఫుల్ అవతారంలో చూడాలని ఆశపడుతుండగా, దర్శకుడు సుజీత్ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను మలిచాడు. పవన్ స్టైల్, యాక్షన్, థమన్ అందించిన సంగీతం ఇలా అన్ని కలిసి ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగిస్తున్నాయి.
ఈ సినిమా విడుదలైన పదకొండో రోజు వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ‘ఓజీ’ అధికారికంగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు దక్కించుకుంది.
పవన్ కళ్యాణ్ ఎనర్జీతో పాటు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత జోష్ చేకూర్చింది. ఇమ్రాన్ హష్మి విలన్‌గా ఆకట్టుకోగా, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ వంటి నటులు తమ పాత్రలతో సినిమాకు బలం చేకూర్చారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు.