విశాఖపట్నం నగరాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తానని ప్రకటించి.. అయిదేళ్ల పదవీకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్ధరించారు? అయిదువందల కోట్లు తగలేసి.. తన నివాసం కోసం రాజభవనాలను నిర్మించుకోవడం తప్ప ఆయన ఆ నగరానికి ఒరగబెట్టింది ఏమిటి? బయటినుంచి చూసే వారికి ఏమీ కనిపించకపోవచ్చు. కానీ.. విశాఖలోను, పరిసర గ్రామాల్లోనూ ఉన్నవారికి ఆయన నిర్ణయమూ మరియు పాలన ప్రభావం ఏమిటో చాలా స్పష్టంగా తెలుసు. ఆ ప్రకటనను అడ్డుపెట్టుకుని వందల వేల ఎకరాల భూములను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. నిరుపేదల భూములను చవకధరలకే కొనుగోలు చేశారు.
అన్యాయంగా డిపట్టా భూములకు కూడా అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమంది నాయకులు, వారికి అనుకూలురైన ఐఏఎస్ అధికారులు కూడా.. వేల కోట్ల రూపాయల విలువైన భూములను తమ కబ్జా లోకి తెచ్చుకున్నారు. జగన్ కలగన్న రాజధాని అక్కడకు వచ్చి ఉంటే.. వారు ఆ భూముల్లో కోట్లాది రూపాయల లాభాలను కళ్లజూసి ఉండేవారు. కానీ.. వారి ఊహలు ఫలించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు తాము అగ్రిమెంట్లు చేసుకున్న భూములతో.. విశాఖ సమగ్రాభివృద్ధికి మోకాలడ్డడానికి కుట్రలు చేస్తున్నారు.
విశాఖలో గూగుల్ డేటాసెంటర్ ఏర్పాటు చేయడానికి 200 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల.. ప్రపంచ ఐటీ రంగంలో విశాఖకు ఒక గుర్తింపు వస్తుందని కూడా అంతా అనుకుంటున్నారు. వేల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కూడా ఆశిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. భూసేకరణ చట్టం ప్రకారం.. మార్కెట్ విలువకు రెండున్నర రెట్లు పరిహారం ఇచ్చేలా ఒక్కో ఎకరాకు 17 లక్షలు ముట్టజెప్పేలా తొలుత ప్రకటించారు.
తర్వాత రైతులు విజ్ఞప్తి చేయడంతో 2.55 లక్షలు అదనంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. మొత్తానికి ఎకరాకు 19.55 లక్షలు రైతులకు ముట్టనుంది. అయితే ట్విస్టు ఏంటంటే.. దళితులు, నిరుపేదలకు చెందిన ఈ డిపట్టా భూములు.. గతంలో కొనేందుకు వైసీపీ నేతలు అగ్రిమెంట్లు చేసుకుని ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లు తాము స్థలాలు ఇవ్వబోం అంటూ రైతులతో కోర్టుల్లో కేసులు వేయిస్తూ.. విశాఖకు గూగుల్ రాకుండా మోకాలడ్డుతున్నారు.
వైసీపీ నేతల బినామీ ఒకరు 50 మంది రైతులతో ఎకరాను 7 లక్షలకు కొనేలా ఒప్పందాలు చేసుకుని 3.5 లక్షల వంతున అప్పట్లో చెల్లించారు. వందరోజుల్లో మిగిలిన సొమ్ము ఇస్తామని అన్నారు గానీ.. ఏడాదిన్నర దాటినా ఆ ఊసులేదు. ఇప్పుడు వారు అగ్రిమెంట్లు చేసిన రైతులను బెదిరించి వారితో ఈ భూములు ప్రభుత్వానికి అమ్మకుండా కోర్టులో కేసులు వేయిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం.. కాలం చెల్లిన అగ్రిమెంట్లను పెట్టుకుని.. రైతులను బెదిరించి వారితో కేసులు వేయిస్తున్న వైసీపీ నేతల బినామీ వ్యవహారం తేల్చడానికి అధికారులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.