మళ్లీ మళ్లీ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న షర్మిల

ఆలయాలను కాదు.. ముందు మరుగుదొడ్లను నిర్మించాలని వ్యాఖ్యానించడం ద్వారా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల ఆల్రెడీ ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఆ వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్నే సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని దులుపుకోవడానికి ప్రయత్నించింది. వైఎస్సార్ పిల్లలిద్దరూ హిందూ మతం ద్రోహులు అనే కోణంలోంచి జగన్ కూడా కలిపి ప్రత్యర్థులు విమర్శించడానికే ఇలాంటి మాటలు షర్మిల అన్నారని ఒక ప్రచారం కూడా నడిచింది. ఏది ఏమైనప్పటికీ.. షర్మిల ఆ మాటలతో సెల్ఫ్ గోల్ వేసుకున్న మాట నిజం. ఆ వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి మళ్లీ మళ్లీ మీడియా ముందుకు వస్తూ మళ్లీ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారామె.

తాజాగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. దళిత వాడల్లో గుడులు కట్టించేబదులుగా మౌలిక సదుపాయాల కల్పన ఉండాలని అడగడం తప్పా? అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒకే బాత్రూం ఉన్నదని హైకోర్టు ప్రస్తావనను కూడా ఉదాహరిస్తున్నారు. వ్యవస్థలో ఉన్న ఆలోపాలను ఎవ్వరూ కాదనడం లేదు. ఆమె రోడ్డు మీద వెళుతున్న మహిళ కాదు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్రశాఖ సారధి. జులైలో హైకోర్టు ఆ మాట చెబితే.. ఇప్పటిదాకా షర్మిల ఏం చేస్తున్నారు? ఎందుకు ఆ దళితబిడ్డలు చదువుకునే చోటకు వెళ్లి తమ పార్టీ తరఫున అదనపు బాత్రూంలు కట్టేవరకు పోరాటం చేయకుండా మిన్నకుండిపోయారు. ఇప్పుడు దళితవాడల్లో గుడులు కట్టాలని టీటీడీ అనుకుంటూ ఉంటే.. ఆ టాపిక్ ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు లేవనెత్తుతున్నారు ఎందుకు? ఇదంతా ఆమె మళ్లీ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న ప్రయత్నమే.

తిరుమలలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్టు ఆరోపణలు వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు కోరిన మొదటి వ్యక్తి తానేనని ఆమె అంటున్నారు. కావొచ్చు గాక.. అలాగని.. ఇప్పుడు చేసిన దురుసు వ్యాఖ్యలు కరెక్ట్ అయిపోతాయా? అనేది ప్రజల సందేహం. తాను ప్రజల గురించి మాట్లాడితే ఆర్ఎస్ఎస్, భాజపా కుటిలప్రచారం చేస్తున్నాయని అంటున్న షర్మిల, ఆమె మాటలను కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతివ్వకుండా.. ఆమెను గాలికి వదిలేసుకున్నదని గ్రహిస్తే ఆమెకే మంచిది. 

Related Posts

Comments

spot_img

Recent Stories