మిథున్ రెడ్డి మాటలపై ప్రజల సందేహాలు ఇవే!

దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్డగోలుగా కాజేసిన లిక్కర్ కుంభకోణంలో కీలక సూత్ర+పాత్రధారుల్లో ఒకడైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎట్టకేలకు జైలునుంచి బెయిలుపై విడుదల అయ్యారు. ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిలు ఇచ్చింది. 73 రోజుల పాటు జైల్లో గడిపిన ఆయన బయటకు వచ్చారు. జైలు జీవితాన్ని కూడా రాజకీయంగా ఎడ్వాంటేజీగా, అనుకూలాంశంగా మార్చుకోవడం వారి అవసరం గనుక.. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. జైల్లో ఎన్ని రోజులు ఉంచినా, ఎన్ని కేసులు పెట్టినా భయపడబోయేది లేదని రంకెలు వేస్తున్నారు. ఈ క్రమంలో తన జైలు జీవితం గురించి ఆయన కొన్ని సంగతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తనను జైల్లో ఉంచి వేధించింది అనడానికి ఆయన కొన్ని విమర్శలు సంధిస్తున్నారు. అయితే ఆ మాటలన్నీ కూడా పనిగట్టుకుని సర్కారు మీద బురద చల్లడానికి ప్రయోగిస్తున్న అస్త్రాలే తప్ప.. ఏ మాత్రం లాజిక్ కు అందేవి కాదు. ఆయన మాటలు- వాటి గురించి ప్రజల సందేహాలు గమనిద్దాం.

మిథున్ : జైల్లో నన్నో తీవ్రవాదిలా చూశారు. ములాఖత్ లో ఫోన్ లో కుటుంబసభ్యులతో తప్ప ఇతరులతో మాట్లాడే పరిస్థితి లేదు.
ప్రజలు : తీవ్రవాదిలా చూడడం అంటే ఏమిటి? తీవ్రవాదులకు మీకు ఇచ్చినన్ని ములాఖత్ లు ప్రపంచంలో ఎక్కడైనా ఇవ్వడం జరుగుతుందా?
కుటుంబసభ్యులతో తప్ప ఇతరులతో మాట్లాడనివ్వలేదు అంటే అర్థం ఏమిటి? బయటి ప్రపంచంలో ఉన్న మీ అనుచరులతో మాట్లాడి.. సాక్ష్యాలను ఎలా తారుమారు చేయాలో పురమాయించాలని, మీ దందాలను కప్పెట్టేయాలని అనుకున్నారా? పొద్దస్తమానమూ ములాఖత్ లలోనే గడుపుతూ.. నన్ను ఇతరులతో ఫోనులో మాట్లాడనివ్వలేదు.. అని ఆరోపించడంలో అర్థముందా? మిమ్మల్ని కలిసిన వ్యక్తుల జాబితా బయటకు తీస్తే ఎందరితో మాట్లాడారా తేలుతుంది కదా.

మిథున్ : సీసీ కెమెరాల నిఘా ఉంచారు.
ప్రజలు : ఏ కెమెరాలు లేకపోతే.. మీరు గోడకు తలబాదుకుని గాయం చేసుకుని పోలీసులు నన్ను జైల్లో కొట్టారు అని ఆరోపించకుండా ఉంటారనే గ్యారంటీ ఉందా? సీసీ కెమెరాలు లేకపోతే.. జైల్లో నామీద హత్యాప్రయత్నం జరుగుతోంది. కనీస భద్రత ఏర్పాట్లు కూడా లేవు అని మీరు  ఆరోపించకుండా ఉండేవారేనా?

మిథున్ : కోర్టు ఆదేశాలిచ్చాకే కనీస వసతులు కల్పించారు.
ప్రజలు : మిథున్ రెడ్డీ.. తమరు జైలుకు ఎంపీగా అధికారిక సందర్శనకు వెళ్లలేదు. ఖైదీగా వెళ్లారు. అందరు ఖైదీలకు ఎలాంటి వసతులు కల్పించారో.. అవి మీకు తక్కువ చేస్తే మాట్లాడాలి. కోర్టు ఆదేశించినవి ఇవ్వకపోతే మాట్లాడాలి. కోర్టు చెప్పకముందే ఒక ఖైదీకి అదనపు వసతులు దాన్నేమంటారో మీకు తెలియదా?

Related Posts

Comments

spot_img

Recent Stories