హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ వేడుక ఎంతో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం కూడా స్వయంగా వహించిన ఈ చిత్రంపై ఆయన తన అనుభూతులను పంచుకున్నారు.
తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ చెప్పారు. చిన్నప్పుడు తన అమ్మమ్మ దగ్గర కూర్చొని ఊరి కథలు, పురాణాలు వింటూ పెరిగేవాడినని, ఆ కథలు నిజమేనా అని ఆశ్చర్యపోయేవాడినని ఆయన తెలిపారు. అలాంటి కథలను ఎప్పుడో ఒకరోజు ఎవరో తెరపై చూపిస్తారని ఊహించలేదని, రిషబ్ శెట్టి దాన్ని నిజం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
రిషబ్ ప్రతిభ గురించి మాట్లాడిన ఎన్టీఆర్, ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ అసాధారణంగా ప్రతిభావంతుడు అని అన్నారు. ఒకేసారి పలు విభాగాల్లో తన ముద్ర వేసే వ్యక్తి అని ఆయనను ప్రశంసించారు. అంతే కాకుండా ఉడుపి కృష్ణుడి ఆలయ దర్శనం కోసం తన తల్లి కోరికను రిషబ్ శెట్టి, ఆయన భార్య ప్రగతి నెరవేర్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.