రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ది రాజా సాబ్’ ఈసారి సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను కలవబోతోంది. జనవరి 9, 2026న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్ సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్‌ను చూస్తే సినిమాపై మంచి బజ్ నెలకొన్నట్టే తెలుస్తోంది.
అయితే, సంక్రాంతి సీజన్‌లో భారీ సినిమాలు పోటీగా రావడం సాధారణమే అయినా, రాజా సాబ్ మేకర్స్ మాత్రం జాగ్రత్తగా ముందడుగు వేసినట్టు సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. కానీ తమిళ్‌లో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. అదే రోజున థళపతి విజయ్ కెరీర్‌లో చివరి సినిమా ‘జన నాయగన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద క్లాష్ తప్పదని కనిపిస్తోంది.
అలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాజా సాబ్ టీం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళ్ డబ్బింగ్ వెర్షన్‌ను అసలు రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ఆలస్యంగా, అంటే జనవరి 10న విడుదల చేయాలని నిర్ణయించారట. దీనివల్ల విజయ్ చివరి సినిమాకి గౌరవం ఇచ్చినట్టవుతుంది. ఈ నిర్ణయాన్ని సినీ వర్గాలు సానుకూలంగా స్వాగతిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.