పార్టీల కార్యకర్తల పట్ల జగన్ ది ద్రోహచింతన కాదా?

రాజకీయ ప్రేరేపిత హత్యల్లో చనిపోయే వారు ఎవరు? పార్టీ కార్యకర్తలే కదా? ఇలాంటి ఘర్షణల్లో ఎవరు చనిపోయినా వారు ఏదో ఒక పార్టీకి కార్యకర్తలే అయి ఉంటారు. వారి కుటుంబాలు దైన్యస్థితిలో ఉండేవి అయితే.. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం పార్టీల మీద ఉంటుంది. కనీసం ఆ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడైనా వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఒక ఏర్పాటు ఉండడం తప్పేమీ కాదు. కానీ.. రాజకీయ హత్యలకు గురైన కుటుంబాను ఆదుకునేలా.. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా పెట్టిన బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఈ చర్చ బయటకంటె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా ఎక్కువ చర్చ జరుగుతోంది. కనీసం ఇలాంటి బిల్లు విషయంలో మౌనం పాటిస్తే, భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు.. తమ కార్యకర్తల కుటుంబాలకు కూడా మేలు జరుగుతుంది కదా.. వైసీపీ ఎందుకింత దుర్మార్గంగా వ్యతిరేకిస్తున్నట్టు? అని ప్రజలు అనుకుంటున్నారు. అసలు పార్టీ కార్యకర్తల సంక్షేమం అంటే కించిత్తు కూడా పట్టింపులేని పార్టీ వైసీపీ మాత్రమే, జగన్ రెడ్డి మాత్రమే  అని పార్టీలోనే పలువురు అంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకమైన పథకాలు కూడా ఏమీ లేవు. కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారికి అయిదు లక్షల రూపాయల ప్రమాద బీమా వంటివి కూడా ఆ పార్టీలో లేవు. అలాంటి బీమా సదుపాయాలు, కార్యకర్తల పిల్లలకు ఉచిత విద్య వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని.. జగన్ అభిమానులు కూడా అధికారికంగా తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటున్న పరిస్థితి. ఇది నిజానికి జగన్ దళాలు సిగ్గుపడాల్సిన వ్యవహారం. పైగా కార్యకర్తలు మరణిస్తే.. వారి మరణాల్ని రాజకీయ మైలేజీకోసం వాడుకోవడానికి జగన్ యాత్రలు చేసి, తనకు జేజేలు కొట్టించుకుని, తనకు సెక్యూరిటీ ఇవ్వలేదని విలపించి.. తాను సీఎం అనే నినాదాలు చేయించుకోడానికి వాడుకుంటారే తప్ప.. వారి కుటుంబాలకు అందించే ఆర్థిక సాయం కూడా తక్కువ. చివరికి ప్రభుత్వం చేయగల సాయానికి కూడా జగన్ అడ్డుపడుతున్నారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు.

ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్త చంద్రయ్య రాజకీయ ప్రేరేపిత హత్యకు గురైతే ప్రభుత్వం ఆయన కొడుక్కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. కానీ వైసీపీ దానిని వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించాలి. తమ కుటుంబాల్లో ఎవరైనా మరణించినా.. భవిష్యత్తుల్లో తమ పార్టీ వచ్చాక ఇలాంటి ఉద్యోగాలతో ఆదుకోవచ్చు కదా అనేది ప్రజల ఆశ. సొంత కార్యకర్తలకు కూడా నష్టంచేసేలా జగన్ ద్రోహచింతన ఉన్నదని.. ఆయన పెట్టడు, అడుక్కుతిననివ్వడు అని కార్యకర్తలు వాపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories