పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా, దర్శకుడు సుజీత్ తీసిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి” విడుదలైన క్షణం నుంచి ఘన విజయం సాధించింది. థియేటర్లలోకి అడుగుపెట్టిన రోజే పవన్ కెరీర్లో ఎన్నడూ లేని స్థాయిలో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని స్థాయిలో దుమ్ము రేపింది.
అయితే ప్లానింగ్ లోపం కారణంగా ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషల్లో పెద్దగా ప్రొమోషన్ లేకుండానే డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేశారు. ఆ కారణంగా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, హిందీ మార్కెట్లో మాత్రం క్రమంగా వృద్ధి కనిపిస్తోందని సమాచారం. మొదట్లో పెద్దగా ఆకర్షణీయంగా లేకపోయినా, ఇప్పుడు నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల “ఓజి” షోలు పెంచుతున్నారట.
అలాగే సోషల్ మీడియాలో కూడా హిందీ వెర్షన్ చూసిన నార్త్ ఆడియెన్స్ రివ్యూలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో హిందీలో ఈ సినిమా నెమ్మదిగా పుంజుకుంటుందా? లేక ఇదే స్థాయిలో ఆగిపోతుందా? అన్నదానిపై ఆసక్తి పెరుగుతోంది.