టాలీవుడ్ లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తాజా సినిమా “ఓజీ” ప్రేక్షకులని పూర్తిగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి అంచనాలు రేపగా, థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు తో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో పవన్ మాస్ లుక్, యాక్షన్ సీక్వెన్సులు ఎలా హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ పని.
రవి కె చంద్రన్ కెమెరా చూపు వల్ల పవన్ ప్రతి సీన్ లో ఒక కొత్త ఎనర్జీ తో కనిపించాడు. ఆయన ఫ్రేమింగ్, లైటింగ్, విజువల్స్ అన్ని కలిపి పవన్ ఇమేజ్ కి మరో లెవెల్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి.
తన నలభై ఏళ్ల కెరీర్ లో ఇంత స్టైల్, ఆరా కలిగిన నటుడు తాను చూడలేదని రవి కె చంద్రన్ స్పష్టంగా చెప్పారు. తాను ఇప్పటివరకు హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ టాప్ హీరోలతో పనిచేసినా, పవన్ దగ్గర ఉన్న ప్రత్యేకమైన స్టైల్ మాత్రం వేరే స్థాయిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ సింపుల్ డ్రెస్ లోనూ, సాధారణ లుక్ లోనూ కనిపించినా ఆ మ్యాజిక్ ఎక్కడా తగ్గదని ఆయన చెప్పడం ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేసింది.