సాధారణంగా అసెంబ్లీలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఉంటారు. అదే మండలి విషయానికి వస్తే.. ప్రజల్లో ఎన్నికయ్యే అవసరం లేని పెద్దవాళ్లు, గౌరవ ప్రదమైన వ్యక్తులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు ఉంటారు.. అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రజల్లో నెగ్గలేకపోయినంత మాత్రాన.. ఇలాంటి నిపుణుల మేధస్సు కూడా చట్టాల రూపకల్పనకు అవసరం అనే ఉద్దేశంతోనే.. శాసనమండలిని ఏర్పాటుచేశారు. కానీ జరుగుతున్నది ఏమిటి? ప్రత్యేకించి కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ పార్టీకి కొమ్ముకాస్తూ ఉండే దుర్మార్గులు, తమ పార్టీ గెలవడానికి రౌడీయిజం దందాలుచేసేవాళ్లు, ఎన్నికల్లో నిలబడితే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేని దుష్టులందరినీ తీసుకువచ్చి ఎమ్మెల్సీలుగా మార్చి మండలిలో కూర్చోబెడుతున్నారు. నిజానికి అలాంటి వారినుంచి సంస్కారవంతమైన సభా ప్రసంగాలను ఆశించడం కూడా తప్పే అవుతుంది. ఇదే తరహాలో గురువారం నాడు సభలో ఓ సంఘటన చోటుచేసుకుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకున్నారు. ఆయన సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిందించడానికి పూనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్సూ సెవెనూ అంటూ రెండు పదాలు కంఠతా పట్టి.. ప్రతిరోజూ పారాయణం చేస్తున్నారు గనుక.. ఈ రకం నిందల ద్వారా జగన్ ను ప్రసన్నం చేసుకోవచ్చునని ఆయన భావించారేమో తెలియదు. అమలవుతున్న పథకాల్లో ప్రభుత్వపరంగా లోపాలుంటే వాటిని గురించి చర్చించి ఉంటే చాలా బాగుండేది. కానీ అలా జరగలేదు. కేవలం చంద్రబాబునాయుడు చులకన చేయడం, అవమానించడం మాత్రమే ఎజెండాగా సదరు రమేశ్ యాదవ్ ప్రసంగం సాగిపోయింది.
ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. కుప్పం ఎమ్మెల్యే అని వ్యవహరించడం ద్వారా రమేశ్ యాదవ్ తన కురచబుద్ధిని చాటుకున్నారు. ఈ వ్యవహారంపై మండలిలో రభస జరిగింది. మంత్రులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. రమేశ్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని, రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని అవమానకరంగా మాట్లాడడమే కాకుండా.. ఈ విమర్శలకు సమాధానంగా.. మా నాయకుడిని పులివెందుల ఎమ్మెల్యే అని పిలుస్తున్నారు కదా.. అని రమేశ్ యాదవ్ వక్రవాదనలు వినిపించడం గమనార్హం. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా.. రమేశ్ యాదవ్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగిస్తామని ప్రకటించడం గమనార్హం.