మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సొంత పార్టీ కార్యకర్తలను మరోసారి వంచిస్తున్నారు. అందరూ పార్టీకి దన్నుగా ఉండండి.. పార్టీని కాపాడుకోవాలి.. వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యామిలీగా ఉండాలి.. అనే రకరకాల సుద్దులు చెబుతున్నారే తప్ప.. కార్యకర్తల కోసం పార్టీ ఏం చేస్తుందో మాత్రం మాటమాత్రంగా కూడా జగన్ ప్రస్తావించడం లేదు. తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు అందరికీ త్వరలోనే ఐడీ కార్డులు ఇస్తాం అని, జగనన్న 2.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వారందరినీ వృద్ధిలోకి తీసుకువస్తామని అంటున్నారు. అంటే దానర్థం ఏమిటన్నమాట.. మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా కార్యకర్తలకోసం పార్టీ తరఫున వీసమెత్తు సాయం కూడా అందించడం ఉండదు అనే కదా.. అని అందరూ పెదవి విరుస్తున్నారు.
నేను లేస్తే మనిషినా కాను.. అని ప్రగల్భాలు పలికే ప్రబుద్ధుడి వ్యవహార సరళికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల తీరుకు పెద్దగా తేడా ఏమీ ప్రజలకు కనిపించడం లేదు. గెలిస్తే, మళ్లీ ముఖ్యమంత్రిని అయితే మీ అందరి జీవితాలను ఉద్ధరించేస్తాను అని చెప్పుకుంటున్న పెద్ద మనిషి.. అప్పటిదాకా కార్యకర్తల కోసం ఏం ఒరగబెడతాడు అనేది ఎవ్వరికీ అర్థం కాని సంగతి.
ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కరడుగట్టిన జగన్ అభిమానులు కూడా.. ప్రమాద ఇన్సూరెన్సు వంటి సదుపాయాలు కలిసి వస్తాయని తెలుగుదేశం పార్టీ, లేదా, జనసేన పార్టీల క్రియాశీల కార్యకర్తలుగా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. రెంటపాళ్ల పర్యటన సమయంలో ఆ పోకడ చాలా స్పష్టంగా బయటపడింది కూడా. ఇలాంటి సంఘటనలు గమనించి సిగ్గుపడాల్సిన జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం క్రియాశీల కార్యకర్తలు కూడా నన్ను అభిమానిస్తున్నారు.. అంటూ ఘనంగా చెప్పుకున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకోసం, వారి సంక్షేమం, బాగు కోసం చిన్న పథకాన్ని అయినా చేపట్టకపోవడం.. అందరికీ అసహ్యంగా కనిపిస్తోంది. జగన్ ఎంతసేపూ.. నేను మళ్లీ గెలిస్తే.. మీ బతుకుల్ని ఉద్ధరిస్తా, మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తా, తెలుగుదేశం వాళ్ల అంతుతేలుస్తా అని మాత్రమే అంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు జగన్ మళ్లీ గెలవడం అనేది జరిగే పనేనా? కార్యకర్తలకోసం ఒక్క పైసా కూడా విదిల్చకుండా.. వారందరినీ వచ్చే ఎన్నికల దాకా కాపాడుకోవడం సాధ్యమేనా? అనే అనుమానాలు కూడా పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి.