తప్పుడు పనిచేసినా కూడా దానిని ప్రపంచానికి చేసిన మహోపకారం అని చాటుకుంటూ సమర్థించుకోగల తెలివితేటలు కొందరికి ఉంటాయి. అలాంటి తెలివితేటల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉద్ధండులు. ఇప్పుడు ఆయన బాటలోనే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణకార రెడ్డి కూడా చెలరేగుతున్నారు. వివరాల్లోకి వెళితే..
లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలను ఎన్నడైనా గమనించారా? ఈ వ్యవహారంలో ఏకంగా మూడున్నర వేల కోట్ల రూపాయలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అక్రమంగా, అడ్డగోలుగా దోచుకున్నట్లుగా ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ జగన్ మాత్రం ఈ దోపిడీకి అనుకూలంగా రూపుదిద్దిన కొత్త లిక్కర్ పాలసీని ఇప్పటికి కూడా ఒక అద్భుతంగా వర్ణిస్తుంటారు. ఈ లిక్కర్ పాలసీ ద్వారా తాను ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల మేలు చేశానని.. ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒకవైపు దోపిడీ సంగతి బట్టబయలైన తర్వాత కూడా వంకరగా మాట్లాడుతూ ప్రజలను బుకాయించవచ్చునని అనుకోవడం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చేతనైన విద్య కాదు! ఆయన బాటనే ఇప్పుడు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారు!!
పరకామణి దొంగల నుంచి ఆస్తులను టిటిడికి రాయించుకుని సెటిల్మెంట్ చేసిన వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతున్న సంగతి అందరికీ తెలుసు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఈ దోపిడీని కూడా తన వంకర మాటలతో సమర్ధించుకునేందుకు ప్రయత్నించడం విశేషం! దేవుడి సొత్తును ఒక వ్యక్తి దోచుకుంటే అతడితో ఆస్తులు రాయించుకుని, సెటిల్మెంట్ చేయడానికి మీకు ఏ రకమైన అధికారం ఉంది? అలా సెటిల్ చేయడానికి మీరు ఎవరు? రాజీ కుదుర్చుకునే హక్కు మీకేముంది? అని ప్రస్తుత బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నిస్తుంటే.. భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా తిరుగుడు మాటలతో పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్నారు. తన హయాంలో దోపిడీ జరగలేదు అని వైయస్సార్ కాంగ్రెస్ పాలన చివరి దశలో బోర్డు చైర్మన్ గిరిని అనుభవించిన భూమన అంటున్నారు.
ఈ మాటల ద్వారా తనకంటే ముందు చైర్మనుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో దోపిడీ జరిగినట్టుగా ఆయన చెప్పదలుచుకుంటున్నారేమో క్లారిటీ లేదు. అయితే సెటిల్మెంట్ చేయడానికి నీకు హక్కెక్కడ ఉంది అని అడుగుతుంటే సెటిల్మెంట్ చేయడం ద్వారా టీటీడీకి తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అతి గొప్ప మేలు చేసినట్లుగా భూమన బిల్డప్పులు ఇస్తుండడం విశేషం. కాకపోతే ఆయన పాత్ర గురించి ప్రజలలో ఖచ్చితమైన నమ్మకం ఏర్పడింది. సెటిల్మెంట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా లబ్ధి పొందారని ప్రజలు నమ్ముతున్నారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన చేసిన పాపాలు మాసిపోవు అని భూమన తెలుసుకోవాలని ప్రజలు అంటున్నారు.