అవినాష్ కు గ్రహాలు ప్రతికూలం అవుతున్నాయా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప ఎంపీ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతీతిపాత్రమైన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డికి.. గ్రహాలు ప్రతికూలంగా మారుతున్నాయా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ప్రస్తుతం బెయిలు మీద బయట ఉన్న అవినాష్ రెడ్డికి త్వరలోనే గడ్డు పరిస్థితులు ఎదురవబోతున్నాయా? అంటే, అవుననే సమాధానమే వినవస్తోంది. ఎందుకంటే.. వివేకా హత్య కేసులో ఇప్పటికే ముగిసింది అనుకుంటున్న దర్యాప్తు ను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ సీబీఐ సుప్రీం కోర్టుకు తెలియజేయడమే కారణం! కేసులో దర్యాప్తు కొనసాగించడానికి తగ్గట్టుగా కోర్టు ఉత్తర్వులు వస్తే గనుక, ప్రస్తుతం బెయిలు మీద బయట స్వేచ్ఛగా తిరుగుతున్న నిందితులు అందరూ మళ్లీ జెయిల్లోకి వెళ్లాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సహా మిగిలిన నిందితులు పొందిన బెయిళ్లను కూడా రద్దు చేయాలని కోరుతూ, వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ నడుపుతున్నారు. ఈ పిటిషన్ విచారణల సందర్భంగా.. ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్టుగా గతంలో సీబీఐ సుప్రీం ఎదుట పేర్కొంది. కేసులో నిందితులు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరులు శివశంకర్ రెడ్డి అందరి బెయిళ్లను రద్దు చేయాలని ఆమె కోరారు. అయితే.. వీరందరికీ బెయిలు వచ్చి ఉండడమే కారణంగా చూపించి.. ఏ1 నిందితుడు గంగిరెడ్డి కూడా ఇటీవల బెయిలుపై బయటకు వచ్చారు.

అయితే సునీత మాత్రం ఈ కేసును విడిచిపెట్టడం లేదు.  కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి వరకు మాత్రమే కాకుండా, అప్పట్లో ఆయన వెనుకఉండి ఈ వ్యవహారం నడిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతితో సహా అందరినీ విచారించాలని ఆమె కోరుతున్నారు. అందుకే దర్యాప్తును కొనసాగించాలనేది ఆమె ప్రధాన డిమాండ్. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ వాదనల సందర్భంగా.. పిటిషనర్ కోరుతున్నట్టుగా.. కేసు దర్యాప్తు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలియజేసింది. దాంతో సుప్రీం కోర్టు స్పందించి.. దర్యాప్తు కొనసాగడానికి సునీత ట్రయల్ కోర్టులో ఫ్రెష్ గా రెండు వారాల్లోగా పిటిషన్ వేసుకోవాలని సూచించింది.

ట్రయల్ కోర్టులో సునీత పిటిషన్ వేసి, ఆ విషయంలో ఆ కోర్టు తీర్పు చెప్పేదాకా బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, ట్రయల్ కోర్టు గనుక.. దర్యాప్తు కొనసాగడానికి అనుమతిస్తే.. అప్పుడు సుప్రీంలో ఈ బెయిళ్లన్నీ రద్దవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు. అవినాష్ రెడ్డి అండ్ కో అందరికీ ముందు ముందు గడ్డురోజులు పొంచి ఉన్నాయని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories