దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని హాలీవుడ్ స్థాయి విజువల్ స్టాండర్డ్స్‌తో తీసుకెళ్లాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుండటం మరో ప్రత్యేకతగా మారింది.
తాజాగా ఈ సినిమా కెన్యా షెడ్యూల్ పూర్తయింది. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ షెడ్యూల్‌ను కాశీ నేపథ్యంతో తెరకెక్కించబోతున్నారు. దానికి తగ్గట్టుగా పెద్ద సెట్‌ని నిర్మిస్తున్నారని సమాచారం. ఈ భాగంలో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొననుందని తెలిసింది.
ఇక ఈ సినిమా కథ వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తాను మరియు రాజమౌళి ఇద్దరూ దక్షిణాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ పుస్తకాలకు అభిమానులమని చెప్పారు. ఆ పుస్తకాల ప్రభావంతోనే ఈ సినిమా స్క్రిప్ట్ రూపుదిద్దుకుందని ఆయన చెప్పిన మాటలతో స్పష్టమవుతోంది. అందువల్ల ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్లో ఉండబోతుందని అర్థమవుతోంది.