వైయస్ జగన్మోహన్ రెడ్డిని పదవీచ్యుతుడిని చేసి, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టిన రాష్ట్ర ప్రజలు, ప్రత్యామ్నాయంగా తాము ఎంచుకున్న చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల సంతృప్తికరంగానే ఉన్నారని అనడానికి ఇది మరొక ఉదాహరణ. సాధారణ ప్రజలు, గ్రామీణుల స్పందనలు, అభిప్రాయాలు వేర్వేరు సందర్భాలలో వ్యక్తం అవుతుండగా.. ఉద్యోగుల వర్గం వైపు నుంచి కూడా ఇప్పటికీ అదే సంతృప్తి వ్యక్తం అవుతుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలను తేల్చి చెబుతున్నారు. ఆయన విశ్లేషణలోనే ఇద్దరు నాయకుల బుద్ధిలోని తేడా తెలిసిపోతోంది.
ఒకటో తేదీన జీతం చెల్లించాలని అడిగితే అరెస్టు చేసిన వ్యక్తి జగన్ అని.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని సూర్యనారాయణ అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఈ ఇద్దరు పాలకుల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నదో తెలుసుకోవడానికి ఈ మాటలు చక్కటి ఉదాహరణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకు ఒక్క ఛాన్స్ అందించిన ఐదు సంవత్సరాల కాలంలో వినాశకర పరిపాలన అంటే ఏమిటో ప్రజలకు రుచి చూపించారు. ఉద్యోగులను ఊరించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తరువాత వారి మీద ఉక్కు పాదం మోపారు. పాదయాత్ర చేసిన సమయంలోనే, తాను అధికారంలోకి వస్తే సీపీఎస్ ను ఒక వారంలోగా రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తానని ప్రగల్బాలు పలికిన ఆయన తాను ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లలో కూడా దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. సరి కదా అందుకోసం అడిగిన, ఆందోళన చేసిన ఉద్యోగుల మీద ఉక్కు పాదం మోపారు. దుర్మార్గంగా కేసులు పెట్టారు. ఉద్యోగ వర్గాల మీద కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు. ఇవన్నీ ఆ వర్గంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు పట్ల శాశ్వతమైన వ్యతిరేకతను ఏర్పరచాయి.
వివాదాస్పద, అత్యంత భారంగా మారే సిపిఎస్ రద్దు గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎలాంటి హామీ ఇవ్వలేదు. దానికి తగ్గట్టుగానే ఆయన పరిపాలన కూడా సాగుతోంది. ఆ అంశాన్ని పక్కన పెడితే ప్రతి విషయాలలో ఉద్యోగులకు స్వేచ్ఛ ఇవ్వడంలోనూ, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లోనూ చంద్రబాబు నాయుడు సర్కారు చాలా పారదర్శకంగా ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగ వర్గాలలో ఇప్పటి కూటమి ప్రభుత్వం పట్ల చెరగని ఆదరణ ఉన్నదని స్పష్టమవుతోంది.