జగన్మోహన్ రెడ్డి కనులు ముందు కమ్ముకున్న భ్రమల పొరలు తొలగిపోయాయి. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి, తన నివాసంకోసం అక్కడ భవనాలను కట్టించుకుని, చిన్న మాయ చేస్తే, అమాయకులైన ఉత్తరాంధ్ర ప్రజలు తనకు నీరాజనం పడతారని వేసుకున్న అంచనాలు తలకిందులు అయ్యాయి. ఎన్నికలలో ఓటమి తదనంతర పరిణామాలలో కూడా ఆ ప్రాంతంలో పార్టీ తిరిగి నిలదొక్కుకుంటుందనే నమ్మకం కూడా కలగడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కి విశాఖపట్నం మీద ఆశలు ఉడిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ, అమరావతి నుంచి మాత్రమే పరిపాలన సాగిస్తాం అని ఆ పార్టీ లో జగన్మోహన్ రెడ్డిని మించిన నాయకుడు, విధాన నిర్ణయాల రూపకర్త, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని జగన్ కూడా చెప్పారు అని మాట వరసకు ముక్తాయించారు.
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడు సంవత్సరాల గడువు కాలంలోగా ప్రధాన నిర్మాణాలు అన్నింటినీ పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం పనులు చేయిస్తోంది. ఒకింత ఆలస్యం అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ, 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి అమరావతి రాజధాని ఒక నిర్దిష్టమైన రూపురేఖలను సంతరించుకుంటుందనడంలో సందేహం లేదు. ఎన్ని సైంధవ వేషాలు వేసినప్పటికీ అమరావతి నిర్మాణాన్ని తాము అడ్డుకోగలడం అసాధ్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమయిపోయింది. అమరావతి నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని, ప్రతిరోజు వాగుతూ ఉండడం తప్ప నిర్మాణాలు జరగకుండా చేయలేం అని వారికి బోధపడింది. దాని ఫలితమే మళ్లీ తాము గెలిచినా సరే అమరావతి నుంచే పాలన సాగిస్తాం అంటుండడం అని ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పటికి ‘అమరావతి రాజధాని దండగ, మూడు రాజధానులే ముద్దు’ అనే మోసపూరితమైన మాటలు వదిలేయకుంటే ప్రజలు ఛీత్కరించుకుంటారనే సంగతి జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ వచ్చింది. గత ఎన్నికలలో ప్రజలు విస్పష్టంగా అమరావతికి అనుకూల తీర్పు ఇచ్చారని అతి కష్టం మీద ఆయన ఒప్పుకుంటున్నారు. అందుకే అమరావతి నుంచే తాను మళ్ళీ సీఎం అయినా సరే పాలన సాగిస్తాను అనిపిస్తున్నారు. ఈ విషయంలో ఇంకా సాగదీస్తే, ఇక ఎప్పటికీ ప్రజలు తనను క్షమించరని, మళ్ళీ ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వరని జగన్ భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అమరావతిలో ప్రధాన నిర్మాణాల పనులు జరుగుతున్న వేగం గమనిస్తే రెండోసారి కూడా చంద్రబాబు సర్కారుకే ప్రజలు పట్టం కడతారు అనేది జగన్ దళాల ఆందోళనకు అసలు కారణం.