మూడురాజధానులపై జగన్ వెనక్కు తగ్గుతున్నట్టేనా?

ఎన్నికల్లో ప్రజలు అత్యంత నీచంగా 11 స్థానాలకు పరిమితం చేసి ఓడించిన పదిహేను నెలల తర్వాత.. జగన్మోహన్ రెడ్డికి ఒకింత జ్ఞానోదయం అయినట్టుగా కనిపిస్తోంది. గత పదిహేను నెలలుగా ఈవీఎంలు ఓడించాయని, దొంగఓట్లు పడ్డాయని, బిజెపితో కలిసి పోలింగులో మోసం చేశారని, ప్రజలను దొంగ హామీలతో వంచించారని రకరకాల మాయమాటలు చెబుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లకు తాను ఎందుకు ఓడిపోయాడో వాస్తవాలను గ్రహించడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. మూడురాజధానుల వికటప్రయోగంపై జగన్మోహన్ రెడ్డి అండ్ కో వెనక్కు తగ్గుతున్నారు. ఈసారి తాము అధికారంలోకి వచ్చినా సరే.. మూడురాజధానుల ఆలోచన మానేసి అమరావతినుంచి పాలన సాగిస్తామని అంటున్నారు.

మామూలుగా ఇంత కీలకమైన సీరియస్ విషయాలు చెప్పడానికి, మీడియా ముందు కీలకమైన విషయాలు మాట్లాడడానికి వైఎస్ జగన్ కు ధైర్యం ఉండదు. ఇలాంటి ముఖ్యమైన సంగతులు చెప్పాల్సి వచ్చినప్పుడెల్లా.. తెరముందుకు సజ్జల రామక్రిష్ణారెడ్డి వస్తారు. ఇవాళ కూడా సజ్జలే ఈ విషయాన్ని ప్రకటించారు. అంబటి వాళ్లు విడిగి ప్రెస్ మీట్లు పెట్టి వంత పాడారు.

చంద్రబాబునాయుడు అమరావతి నగరానికి రూపకల్పన చేస్తున్నారనే దుగ్ధతో, వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి విధ్వంసక పాలనకు తెరతీసిన సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడు ముద్ర ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ సర్వనాశనం చేయడానికి జగన్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అమరావతిపై విషం కక్కుతూ.. మూడురాజధానుల కాన్సెప్టును తెరపైకి తెచ్చారు. విశాఖలో అయిదువందల కోట్లు ఖర్చు పెట్టి.. తన నివాసం కోసం ప్యాలెస్ లు కట్టించుకున్నారు. అంతకు మించి కనీసం పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖ కోసం కూడా ఆయన కించిత్తు పనిచేయనేలేదు. అమరావతి విషయంలో న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా.. ఒక్క ఇటుక పెట్టి పనులు చేయకుడా దుర్మార్గంగా వ్యవహరించారు.

జగన్ అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో దారుణంగా ఛీకొట్టారు. 11 సీట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్రప్రజలందరూ అమరావతి రాజధానికి జైకొట్టినట్టుగా ఎన్నికలు నిరూపించాయి. అయినాసరే.. ఇన్నాళ్లూ జగన్ లోని అహంకారం ఆ విషయం ఒప్పుకోవడానికి అడ్డు వచ్చింది. ఒకవైపు అమరావతిలో చురుగ్గా నిర్మాణ పనులు జరుగుతుండగా.. వైసీపీ దళాలన్నీ రకరకాల అవాంతరాలు సృష్టించడానికి అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ఫలించలేదు. తాము ఎన్ని అడ్డుకున్నా.. రాజధాని కీలక నిర్మాణాలు పూర్తయి తీరుతాయని వారికి అర్థమైంది. ఇప్పుడు పాట మార్చారు.

మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాం అని సజ్జల రామక్రిష్ణారెడ్డి చెబుతున్నారు. ఆ మాట చెప్పకపోతే.. రాష్ట్రంలో జీవితంలో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వారికి అర్థమైనట్టుంది. అందువల్లనే నిస్సిగ్గుగా మడమ తిప్పారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories