రిమాండులో ఉన్న నిందితులను రిమాండు పొడిగించవలసి వచ్చే ప్రతి సందర్భంలోనూ.. పోలీసులకు నానా యాతన ఎదురవుతూ ఉంటే ఇబ్బందే కదా? మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. సిట్ పోలీసులకు అలాంటి యాతన కలిగించడం తన ప్రివిలేజీ అని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీడియా ద్వారా లభించే పబ్లిసిటీ తనకు ఎంత లాభిస్తుందో బాగా తెలిసిన నాయకుల్లో చెవిరెడ్డి ఒకరు. అలాగే.. తాను జైలులో రిమాండు ఖైదీగా ఉన్నా సరే.. మీడియా అటెన్షన్ ను తనవైపు రాబట్టుకోవడం ఎలాగో కూడా టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు అనేకం తెలిసిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర రెడ్డి.
రిమాండు పొడిగింపు కోసం ఆయనను జైలునుంచి కోర్టుకు తరలిస్తున్న ప్రతిసారీ.. మీడియా మైకులు కెమెరాలు కనపడగానే.. ఆయన అతివేషాలు వేస్తుంటారు. చిందులు తొక్కుతుంటారు. పెద్దపెద్దగా అరుస్తూ గోల చేస్తారు. అయితే ఇదే విషయంలో ఆయనను భరించలేకపో పోలీసులు కోర్టుకు మొరపెట్టుకుంటే.. న్యాయమూర్తికి చెవిరెడ్డి హామీ ఇచ్చారు గానీ.. మళ్లీ అదే అతి వేషాలను కొనసాగించడమే తమాషా!
‘నేను తప్పు చేయలేదు. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా.. నేను మద్యం అమ్మలేదు. నన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్లను ఎవ్వరినీ వదిలిపెట్టను. పోలీసుల్ని కూడా వదలిపెట్టేది లేదు..’ ఇలాంటి మాటలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా చెప్పడంలో వింతేమీ లేదనే అనుకుందాం. అయితే చెవిరెడ్డి చెప్పడం మామూలుగా ఉండదు. ఆయన అరుపులు చిందులు తొక్కడాలూ.. పోలీసుల్ని విదిలించుకుంటూ కేకలు పెట్టడాలూ.. వ్యానులోకి ఎక్కకుండా గింజుకోవడాలూ ఇలాంటి ఏకపాత్రాభినయాన్ని ప్రతిసారీ నడిపిస్తుంటారు.
దీంతో విసిగిపోయిన పోలీసులు గతంలో ఆయన రిమాండు పొడిగింపు నిమిత్తం కోర్టుకు వచ్చినప్పుడు.. చెవిరెడ్డిభాస్కర రెడ్డిని మాత్రం ప్రతిసారీ వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని, ఆయనను తీసుకురావడం తమకు చాలా కష్టంగా మారుతోందని న్యాయమూర్తి విన్నవించుకున్నారు.
ఇలా ప్రవర్ఝించడం తప్పుకదా.. అని న్యాయమూర్తి మందలించారు. అయితే.. చెవిరెడ్డి తరఫు న్యాయవాది మాత్రం.. ఇకమీదట అలాంటి ఓవరాక్షన్ చేయబోయేది లేదని కోర్టుకు హామీ ఇచ్చారు. మాట ఇచ్చారే తప్ప ఆయన వైఖరిలో మాత్రం ఏకొద్దిగానైనా మార్పు రానేలేదు. ఇప్పుడు కూడా చెవిరెడ్డి అదేవిధంగా రంకెలువేస్తున్నారు.
శుక్రవారం నాడు రిమాండు పొడిగింపు నిమిత్తం కోర్టుకు తరలించినప్పుడు.. మిగిలిన నిందితులు అందరూ ప్రవర్తించిన తీరు ఒక రకంగా, చెవిరెడ్డి ప్రవర్తించిన తీరు మరోరకంగా ఉండడం విశేషం. జగన్ కు ఆప్తులైన ముగ్గురు నిందితులను బెయిలుపై విడుదల చేసిన రోజు కూడా చెవిరెడ్డి జైల్లో ఉండి బయటి వాళ్లను రెచ్చగొట్టేలా నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చెవిరెడ్డిని వర్చువల్ గానే విచారించే అనుమతి ఇవ్వాలని పోలీసులు మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.