గతజల సేతు బంధనం’లాగా వైసిపి పోరాటాలు!

తెలుగు జాతీయాలలో ఒక మంచి పదముంటుంది. ‘గత జల సేతు బంధనం’ అంటారు పెద్దలు! అంటే నీటి ప్రవాహం మొత్తం వెళ్లిపోయిన తర్వాత వంతెన కట్టి ప్రయోజనం ఏముంది? అని అర్థం! ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నాం, వారి తరఫున పోరాడుతున్నాం, వారి గళం వినిపిస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. అని నానా మాటలు చెప్పుకొని మనుగుడ సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నిజంగా ప్రజా సమస్యలు ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదు. వారు స్పందించడానికి నిద్ర మేలుకొనే లోగా ఆ సమస్య తీరిపోతున్నది. సమస్య తీరిపోయిన తర్వాత వారు చేస్తున్న నిరసనలు, పోరాటాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. పైన చెప్పుకున్న గత జల సేతుబంధనం సామెతను గుర్తుకు తెస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఉంది. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. పనిగట్టుకుని కొందరు యూరియాను చట్టవిరుద్ధంగా నిల్వచేసి, బ్లాక్ మార్కెట్ కు తరలించి, కృత్రిమ కొరతను కూడా సృష్టిస్తూ రైతులను భయవాతావరణానికి గురి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నది. బ్లాక్ మార్కెటింగ్ కు తరలించే వారి భారతం పడుతున్నది. ఉన్న యూరియా నిల్వలను అందుబాటులోకి తెస్తున్నది.

దేశం మొత్తానికి అసలు యూరియా సరఫరానే చాలినంతగా లేకపోవడం వలన ఏర్పడిన కొరత ఇది. రైతులకు యూరియా సమస్య ఉన్నది అని గుర్తించిన వెంటనే ప్రభుత్వం తగనుగుణమైన నిర్ణయాలు తీసుకుంది. కేంద్రంతో సంప్రదించింది. కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 వేల టన్నుల యూరియా కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. తొలి విడతగా దాదాపు 18 వేల టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతి చేసుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చారు. ఇవన్నీ రాష్ట్రంలో రైతులకు ఊరట కలిగిస్తున్న పరిణామాలు అనడంలో సందేహం లేదు. ఇలాంటి ఫలితం రావడానికి కచ్చితంగా చంద్రబాబు నాయుడు కృషి ఉన్నది. రైతులు కూడా కొద్దిగా భయం తగ్గి ఊరట పొందుతున్నారు.

యూరియా సమస్య దాదాపుగా సమసిపోతున్న సమయంలో.. ఇవాళ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఒకవేళ ప్రభుత్వాన్ని నిలదీయాలని అనుకున్నా కూడా ఇంకా ముందుగా ఆ పార్టీ స్పందించి ఉంటే బాగుండేది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటతే..  యూరియా కొరత రైతులను ఇబ్బంది పెడుతున్నదని అర్థమైన వెంటనే తొలుత స్పందించింది ప్రభుత్వమే. ప్రభుత్వం సరైన పకడ్బందీ చర్యలు తీసుకున్నది కాబట్టే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి నిద్ర మేలుకొని ఉద్యమానికి పిలుపు ఇచ్చేలోగా సమస్య తీరిపోయింది కూడా! అందుకే గతజల సేతుబంధనం లాగా సమస్య తీరిపోయిన తరువాత చేసే నిరసన కార్యక్రమాలకు విలువ ఏముంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories