కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మనకి చిన్నగా అనిపించే పనికీ అక్కడ పెద్ద శిక్ష పడుతుంది. తాజాగా అలాంటి అనుభవం మలయాళ నటి నవ్య నాయర్‌కు ఎదురైంది. ఆమెకు ఈ సమస్యకు కారణం మరేదీ కాదు.. చేతి బ్యాగ్‌లో తీసుకెళ్లిన కొన్ని మల్లెపూలే.
ఓనమ్ పండుగ వేడుకల కోసం ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో మలయాళీ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి నవ్య నాయర్ వెళ్లింది. కానీ మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో తన దగ్గర మల్లెపూలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ దేశంలోని బయో సెక్యూరిటీ నిబంధనల ప్రకారం పూలు, పండ్లు, విత్తనాలు ఇలా బయటి దేశాల నుండి ఏ వస్తువూ తీసుకురావడం నిషేధం. అయితే ఆమెకు ఆ విషయం తెలియకపోవడంతో పూలు వెంట తీసుకువచ్చింది.
నవ్య నాయర్ వివరణ ఇచ్చినా అధికారులు కఠినంగా వ్యవహరించి దాదాపు ఒక లక్ష రూపాయలకుపైగా జరిమానా విధించారు. తప్పనిసరిగా చెల్లించాల్సి రావడంతో ఆమె ఆ మొత్తాన్ని కట్టి బయటపడింది. మల్లెపూలు అంత పెద్ద సమస్య అవుతాయని ఊహించలేదని నవ్య చెప్పింది.