‘లిక్కర్ కుంభకోణం అనేది అసలు లేనేలేదు.. లేని కుంభకోణాన్ని కాగితాల మీద సృష్టించారు.. ఆధారాలు అన్నింటినీ సృష్టించారు.. పోలీసులకు డంప్ లలో దొరికిన కోట్ల కొలది రూపాయలను వాళ్లే అక్కడ పెట్టి స్వాధీనం చేసుకున్నారు.. కేవలం మా పార్టీ నాయకులను అరెస్టు చేయడానికి తప్పుడు కేసులతో వేధించడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు..’ అంటూ సిట్ సాగిస్తున్న దర్యాప్తు గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచర గణాలు అనేక రకాలుగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. మద్యం కుంభకోణం అనేది అసలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని, చంద్రబాబు మీదనే కేసులు పెట్టాలని, తమ ప్రభుత్వం హయాంలో మద్యం విక్రయాలు చాలా పారదర్శకంగా జరిగాయని, తమది అత్యంత నిజాయితీగల మద్యం పాలసీ అని రకరకాల చిన్నెలు ప్రదర్శిస్తుంటారు. అయితే వారి మాయ మాటల మర్మం ప్రజలకు అర్థమవుతూనే ఉంది.
సిట్ విచారణలో ఒక్కొక్క వాస్తవం వెలుగులోకి వస్తున్న కొద్దీ వారి బండారం బట్టబయలు అవుతూనే ఉంది. డిస్టిలరీల నుంచి బెదిరింపులతో ఏరకంగా మూడున్నర వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో కూడా ప్రజలందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ మలుపుల మధ్యలో మద్యం కుంభకోణంలో మరొక కొత్త జోడింపు కూడా జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు నాయకులు- మద్యం కుంభకోణాన్ని ఆసరా చేసుకుని సాగించిన ‘అనుబంధ దందా’ ద్వారా ఇప్పుడు వార్తల్లోకి వస్తున్నారు. వారి చిలక్కొట్టుడు వ్యవహారాన్ని కూడా వెలికి తీసిన పోలీసులు మరొక కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసును కూడా సిట్ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది.
మద్యం సరఫరా ఆర్డర్ల ద్వారా వేల కోట్ల రూపాయల ముడుపులు కొల్లగొట్టిన వైకాపా గద్దలకు తోడుగా.. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే రూపంలో వైకాపా కాకులు తమ స్థాయి అరాచక అక్రమ దందాకు పాల్పడిన వైనం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. వైకాపాలో ద్వితీయశ్రేణి నాయకులు కొన్ని జిల్లాల వంతున పంచుకుని.. రవాణా ముసుగులో దోచుకున్నారు. కొందరు సొంత సంస్థల పేరుతోను, కొందరు బినామీపేర్లతోనూ ఈ దందా చేయడం విశేషం.
ఒక్కొక్క మద్యం కేసు రవాణా చార్జీలను రూ.13 నుంచి రూ.34 కు పెంచడం ద్వారా వీరి దోపిడీ సాగింది. ఈ యావత్తు వ్యవహారం విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది. ఈరూపంలో ప్రభుత్వ ఖజానాకు అదనంగా భారం వేయడం ద్వారా.. వైసీపీ రెండో గ్రేడ్ నాయకుల ముఠా అంతా కలిసి 250 కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టుగా విజిలెన్స్ లెక్క తేలుస్తోంది.
విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు వారి బినామీ సంస్థలతోను, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు , వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, చిత్తూరు వైసీపీ ఇన్చార్జి, ఎర్ర చందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి వారి సొంత సంస్త ల పేరుతోను రవాణా ముసుగులో ఈ దోపిడీ పర్వానికి పాల్పడినట్టు గుర్తించారు. అంతా కలిసి 250 కోట్ల మేర దోచుకోగా.. విజిలెన్స్ వారు కేసు నమోదు చేసి, దానిని కూడా సిట్ కు బదిలీ చేయనున్నారు.
వైసీపీ ప్రభుత్వంలోనే ప్రభుత్వ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫార అనేది జిల్లాల జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచేది. ఒక్కో కేసుకు రూ.13 వంతున చెల్లించేవారు. వైకాపా ముఠాలు తమ దోపిడీ తెలివితేటలు ప్దదర్శించి.. ఒక్కో కేసుకు రూ.34 గా పెంచేశారు. ఆ ప్రకారం ఒక్కో కేసు మద్యం పై రూ.21 అదనంగా దోచుకున్నారు. రాజ్ కెసిరెడ్డి, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ల ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ మొత్తం కాంట్రాక్టు పుచ్చుకోగా.. వారు 5 శాతం కమిషన్ తీసుకుని.. జిల్లాల్లో వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చేసి.. అంతా కలిసి దోచుకున్నట్టుగా విజిలెన్స్ తేల్చింది.