పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి లభించినది మధ్యంతర బెయిలు మాత్రమే. ఆయన ప్రస్తుతం ఎంపీగా పదవిలో ఉన్నారు గనుక.. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగు జరుగుతున్నది గనుక.. పోలింగులో పాల్గొనడానికి మాత్రమే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈ మధ్యంతర బెయిలు లభించింది. అయితే.. ఆయన రెగ్యులర్ బెయిలు కోసం చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. ఈ మధ్యంతర బెయిలే.. రెగులర్ గా మారుతుందని ఆశలు పెట్టుకున్న పెద్దిరెడ్డి అభిమానులకు అశనిపాతమే ఎదురైంది. ఈ పిటిషన్ విచారణను ఈ నెల 12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దాంతో.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. ఢిల్లీలో పోలింగు చూసుకుని 11వ తేదీన సాయంత్రం తిరిగి జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసం.. రెండు రోజుల కిందటే మధ్యంతర బెయిలు పొందిన రెగులర్ బెయిలు కూడా వచ్చేస్తుందని చాలా నమ్మకం పెట్టుకున్నారు. మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన వారిలో పైలా దిలీప్ కు గతంలోనే బెయిలు వచ్చిన సంగతి అందరికీ తెలుసు. అయితే మిథున్ రెడ్డితో సమానంగా.. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన నిందితులు జగన్ ఆత్మీయ త్రయం… ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు కూడా బెయిలు వచ్చింది. ఇందు నిందితులకు బెయిలు వచ్చిన తర్వాత తనకు కూడా రెగ్యులర్ బెయిలు తప్పకుండా రాగలదనే నమ్మకం బహుశా మిథున్ రెడ్డికి ఏర్పడి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే.. అందుకోసం ఆయన పిటిషన్ సోమవారం నాడే విచారణకు వచ్చింది. కానీ.. ఆయన ఆశ నెరవేరలేదు. కోర్టు ఆయన బెయిలు వ్యవహారాన్ని 12వ తేదీకి వాయిదా వేసింది.
ఇంకా సూటిగా చెప్పాలంటే.. ఆరోజున అయినా సరే.. బెయిలు దక్కుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే.. ఇప్పటికే జగన్ ఆత్మీయ త్రయం ముగ్గురికి ఇచ్చిన బెయిలు మీదనే బోలెడు గొడవలు అవుతున్నాయి. ఆ బెయిలు రద్దు చేయాలని కోరుతూ సిట్ హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ రభస మధ్యలో 12వ తేదీన మిథున్ రెడ్డి రెగులర్ బెయిలు పిటిషను విచారణకు వచ్చినప్పుడు కోర్టు పెద్దగా సానుకూలంగా స్పందించకపోవచ్చునని పలువురి అంచనా. చార్జిషీటు కూడా దాఖలు చేసిన వారి విషయంలోనే డిఫాల్ట్ బెయిలు ఇవ్వడమే వివాదంగా మారుతున్న నేపథ్యంలో.. ఇంకా ఆయన పాత్ర గురించి విచారణ పూర్తికాని, చార్జిషీటు దాఖలు కాని మిథున్ రెడ్డికి బెయిలు కష్టమేననేది పలువురి అంచనా. అనూహ్యమైన పరిస్థితుల్లో ఆయన మళ్లీ జైలులోనే గడపాల్సి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.
మిథున్ రెడ్డికి సంబంధించినంత వరకు 11వ తేదీ దాకా లభించిన మధ్యంతర బెయిలు కూడా చాలా పెద్ద ఎడ్వాంటేజీ అని.. మద్యం కుంభకోణంలో తన పాత్ర గురించి.. దొరకగల ఆధారాలు అన్నింటినీ స్వయంగా నాశనం చేసేయడానికి ఆయనకు ఈ వ్యవధి చాలునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.