మూడున్నర వేల కోట్ల రూపాయలు కాజేసిన అతిపెద్ద మద్యం కుంభకోణంలో అత్యంత కీలకమైన నలుగురు నిందితులకు ఒకే రోజున బెయిలు లభించింది. వీరిలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజమహేంద్రవరం జైలునుంచి విడుదల అయ్యారు కూడా. ఆయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీగా తాను ఓటు వేయడానికి మధ్యంతర బెయిలు కావాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ వేయడంతో అందుకు అనుగుణంగా తీర్పు వచ్చింది. ఈనెల 11 వ తేదీన సాయంత్రం తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట లొంగిపోవాలని కోర్టు మిథున్ రెడ్డిని ఆదేశించింది.
మిధున్ రెడ్డి విషయం ఇలా ఉండగా.. మద్యం కేసులోని అత్యంత కీలక నిందితులు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులుగా వసూళ్లను అంతిమ లబ్ధిదారుకు చేర్చే పాత్రను పోషించిన మరో ముగ్గురికి కూడా బెయిల్ లభించింది. ఈ కేసులో ఏ31 ధనంజయరెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను బట్టి బెయిలు ఇచ్చారు.
మద్యం కుంభకోణంలో ఈ నలుగురి పాత్ర చాలా కీలకం అని.. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు వివరాలను గమనించిన ప్రతి ఒక్కరికీ తెలుసు. మద్యం కొత్త పాలసీకి రూపకల్పన చేయడం దగ్గరినుంచి.. అందులో ఎలా స్వాహా చేయాలో ప్లాన్ చేయడం, అలాగే డిస్టిలరీ లనుంచి వసూళ్లకు మార్గదర్శకత్వం, నగదురూపంలో వసూలైన మొత్తాలను సంచుల్లో నింపుకుని, అంతిమ లబ్ధిదారుకోసం తరలించడం, అలాగే.. ఆ నగదును వివిధ ఇతర రూపాల్లోకి మార్చడం ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం వంటి కీలక బాధ్యతలను వీరే పర్యవేక్షించారు.
ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ర రెడ్డి జగన్ పేషీలో కీలక అధికారులుగా ఆ రోజుల్లో పనిచేశారు. వైఎస్ భారతికి చెందిన కంపెనీల ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులు అన్నీ చూసే శాశ్వత డైరక్టరు గోవిందప్ప బాలాజీ! మొత్తానికి వీరి పాత్ర చాలా వివాదాస్పదంగా బయటకు వచ్చింది.
ఈ ముగ్గురికి ఇప్పుడు రెగులర్ బెయిలు లభించగా.. మిథున్ రెడ్డి పరిస్థితి వేరు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత.. ఆయన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో 11వ తేదీన లొంగిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో.. ఈ నెల 8న ఆయన రెగులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మిథున్ రెడ్డికి బెయిలు దొరకడం కష్టమే. నిజానికి రాజకీయంగా ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తులైన వీరు బెయిలు మీద బయటకు రావడం వలన.. లిక్కర్ కేసులో సాక్ష్యాధారాలను తారుమారుచేసే ప్రమాదం పుష్కలంగా ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రాజ్ కెసిరెడ్డి సహా నిందితులందరూ కూడా తమకు కూడా బెయిలు కావాలని దరఖాస్తులు చేసుకుంటున్న నేపథ్యంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.