జగన్.. చంద్రబాబునుంచి ఈ లక్షణం నేర్చుకో!

విశాఖపట్నం కైలాసగిరి కొండల మీద స్కైవాక్ బ్రిడ్జిని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆకాశంలో నడిచి వెళుతున్నట్టుగా అనుభూతిని కలిగించే ఈ స్కైవాక్ బ్రిడ్జి ప్రజలను, పర్యాటకుల్ని  ఎంతగానో ఆకట్టుకుంటోంది. విశాఖపట్నం నగరాన్ని పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేకానేక హంగులు ఉన్నాయి. కైలాసగిరి ప్రాంతం మొత్తం పర్యాటకులతో ప్రతినిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. కైలాసగిరిని పర్యాటక ఆకర్షణీయ స్థలంగా తీర్చిదిద్దడం అనేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రారంబం అయింది. అలాంటి కైలాసగిరి కి ఇప్పుడు స్కైవాక్  వంతెన అనేది ఒక అదనపు హంగుగా నిలుస్తోంది. అయితే ఇక్కడే అసలు డ్రామా మొదలవుతోంది.

సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది. ఏదైనా పని విజయవంతం అయితే.. అది నా ఘనత మాత్రమే అని చాటుకోవడానికి సమాజంలో చాలా మంది ఉంటారు. ఇప్పుడు స్కైవాక్ వంతెన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ధోరణినే కనబరుస్తోంది. తమ ప్రభుత్వం కృషి వల్లనే స్కైవాక్ కార్యరూపం దాల్చిందని, విశాఖపట్నం నగరానికి అదనపు హంగులు, శోభన చేకూర్చడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు గురించి ప్రజలు హర్షిస్తున్నారని వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకూ స్కైవాక్ గురించి వారు చేసుకుంటున్న ప్రచారం ఏంటో తెలుసా?

స్కై వాక్ వంతెన కోసం 2024 ఫిబ్రవరిలో నిర్మాణ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదిట. పీపీపీ పద్ధతిలో దీనిని నిర్మించేలా ఏర్పాటుచేశారట. అయితే ఆ ప్రభుత్వం దిగిపోయేలోగా.. నిర్మాణానికి ఎన్ని అడుగులు పడ్డాయో మాత్రం వారు చెప్పడం లేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు.. ఆర్థికంగా లాభపడడానికి కొన్ని ప్రాజెక్టులను ఆమోదించే పర్వంలో భాగంగానే ఈ స్కైవాక్ ప్రాజెక్టు ఓకే చేసినట్టు అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.  కానీ అది ఇప్పుడు పూర్తయింది. ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు ను చూసి సద్బుద్ధిని నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.

జగన్ దళాలు ప్రచారం చేసుకుంటున్నదంతా నిజమే అనుకుందాం. స్కైవాక్ ను వారే ఒప్పందాలు చేసుకుని, శ్రీకారం చుట్టారని అనుకుందాం. కానీ.. ఒక్కసారి ఆలోచించండి. ఇదే రివర్సులో జరిగితే ఎలా ఉండేది? చంద్రబాబు సర్కారు ఒప్పందాలు చేసుకుని శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులను, మొదలు కాకుండా ఉంటే, జగన్ పూర్తిచేసేవారేనా? దాని మీద చంద్రబాబు ముద్ర ఉంటుందనే భయంతో.. దానిని సమూలంగా సర్వనాశనం చేయాలని చూసేవారు కదా? అనేది ప్రజల వాదన. జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు కట్టించిన ప్రజావేదికను కూల్చివేయించడం ద్వారానే.. తన విధ్వంసక పరిపాలన ప్రారంభించారని..  అదివరకటి తెదేపా సర్కారు శ్రీకారం చుట్టిన ప్రతి పనినీ సర్వనాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేశారని ప్రజలు అంటున్నారు. చంద్రబాబునాయుడు అలాంటి సంకుచిత బుద్ధులు చూపించకుండా.. జగన్ సర్కారు ఒప్పందాలు చేసుకున్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టును పూర్తిచేశారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం పరిపాలన అంటే రాజకీయ ద్వేషాలు, వైషమ్యాలు కాదని ఆయన నిరూపించారు. ఆ విషయం జగన్ కూడా తెలుసుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories