ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో జనాభా పెరగవలసిన అవసరం ఉన్నదని తరచుగా చెబుతున్నారు. మనదేశంలో యువతరం జనాభా దామాషా తగ్గుతున్నదని, ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో ఉత్పాదకతకు అవసరమైన యువ మానవవనరుల కొరత ఏర్పడబోతున్నదని అంటున్నారు. అందువల్ల ప్రతి దంపతులు కూడా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను మాత్రమే కనాలని చాలా తరచుగా చెబుతున్నారు. ఒక్క బిడ్డతో సంతానాన్ని నిలుపుదల చేయడం మంచి పద్ధతి కాదని భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఏర్పడకుండా ఉండాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చంద్రబాబు పలు సందర్భాల్లో పిలుపు ఇవ్వడం మనం గమనించాం. ఆయన చెబుతున్న ఈ సామాజిక సిద్ధాంతాన్ని చూసి కొందరు నవ్వుకున్నారు. కొందరు ఆలోచనలో పడ్డారు. కొందరు పాటించాలని అనుకుని ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోని యువ జనాభా గణాంకాల వివరాలను పరిశీలిస్తే భయం కలుగుతోంది. చంద్రబాబు చెప్పిన సామాజిక సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సిందేమో అనే అభిప్రాయం కలుగుతోంది.!
మనదేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 1.9 కు తగ్గిపోవడం ఈ గణాంకాలలో వెలడవుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 2.0 కన్నా తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నిష్పత్తిని టిఎఫ్ఆర్ అంటారు. సదరు టి ఎఫ్ ఆర్ ఈ స్థాయిలో దిగజారితే అది జనాభా తగ్గుదలకు దారితీస్తుంది. భవిష్యత్తులో సమాజంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సంతాన ఉత్పత్తి నిష్పత్తి 2.1 కాగా, పట్టణాలలో అది 1.5 మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇది బీహార్ లో 2.8గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో టిఎఫ్ఆర్ 1.5 మాత్రమే ఉండడం ప్రమాదకర సంకేతం.
టిఎఫ్ఆర్ పడిపోవడం వలన సంతాన ఉత్పత్తి తగ్గి దేశంలో యువకుల సంఖ్య తగ్గుతుంది. ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీనివలన యువ మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. ఉత్పాదకరంగం కుదేలయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. శ్రామిక అవసరాలకు యువతరం అందుబాటులో లేకపోతే.. ఆ ప్రభావం పారిశ్రామిక పురోగతి మీద వెంటనే కనిపిస్తుంది. కాగా చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లుగా దేశం భవిష్యత్తులో కూడా అభివృద్ధి పథంలో పయనించాలంటే దంపతులు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల్ని కనాలి- అని సిద్ధాంతాన్ని బహుశా అందరూ పాజిటివ్గా అర్థం చేసుకుని పాటించాల్సి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబును దార్శినకుడైన నేతగా పలువురు అభివర్ణిస్తుంటారు. ఇది కేవలం పొగద్త కాదని, ఆయన సాంకేతికత, అభివృద్ధి వంటి విషయాలలో మాత్రమే కాకుండా.. జననాల రేటు తగ్గుతూ ఉండడం వలన కలిగి భవిష్యత్ పర్యవసానాలనుకూడా అంచనా వేసి ప్రతిపాదిస్తున్న సామాజిక సిద్ధాంతం.. ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనేదానిని కూడా అందరూ అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.