పార్టీ నుంచి వెలి.. ఊహించినట్లే కవిత స్పందన!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు.. అక్కడ మూడు పార్టీల మధ్య ఉండే విమర్శల హోరు.. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే తీరు.. ఇవన్నీ కూడా ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ అంశాలుగా మారిపోయాయి. కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలు మాత్రమే హాట్ హాట్ టాపిక్ గా తెలంగాణ రాజకీయాలలో సంచలనం నమోదు చేస్తున్నాయి. కల్వకుంట్ల కుటుంబంలోని అగ్ర నాయకుల మధ్య ఉండే విభేదాలు ముదిరి బజారున పడ్డాయి. పర్యవసానాలన్నీ కూడా ఊహించినట్లుగానే నడుస్తున్నాయి. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కూతురు కవితను పార్టీ నుంచి వెలివేయడం జరిగింది. ఆమె తన పార్టీ సభ్యత్వానికి, పార్టీ తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడానికి నిర్ణయించుకుంది. ఇవన్నీ కూడా అందరూ ఊహిస్తున్న పరిణామాలే.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు హరీష్ రావు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో నిగ్గు తేల్చేందుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ సిబిఐ విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ చేతిలో దర్యాప్తు పెడితే, తమ చేతికి మట్టి అంటకుండా కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లుగా వ్యవహారం సెటిల్ అవుతుందని రేవంత్ రెడ్డి తలపోశారు. అయితే వారికి అనూహ్యమైన లాభం కల్వకుంట్ల కవిత రూపంలో కలిసి వచ్చింది. ఆమె మీడియా ముందుకు వచ్చి హరీష్ రావును, సంతోష్ కుమార్ ను తీవ్రంగా నిందిస్తూ వారి కారణంగానే తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద అవినీతి మరకపడిందని ఆరోపించింది. ఈ ఒక్క స్టెప్ మాత్రమే ఊహకందని విధంగా చోటుచేసుకుంది. ఆ తర్వాతే వ్యవహారాలన్నీ అందరూ అంచనా వేస్తున్నట్లుగానే సాగుతున్నాయి.

కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించడం అనే లాంఛనప్రాయమైన నిర్ణయం సోమవారం నాడే బయటకు వస్తుంది.. అని అందరూ అనుకున్నారు! కానీ కెసిఆర్ కొంత వ్యవధి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటేవరకు కూడా ఎర్రవల్లిలోని తమ ఫామ్ హౌస్ లో పార్టీ సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రావు మంగళవారం నాడు ఎట్టకేలకు నిర్ణయాన్ని అధికారం గా ప్రకటించారు. కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న మాటలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయి కనుక బహిష్కరిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది.

కవిత బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు, పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తనకు అనుకూలురు అయిన కొందరు సీనియర్లను పిలిచి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి కవిత కొత్త పార్టీ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా పలువురు ఊహిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories