తండ్రిపై ప్రేమే పామై కాటేస్తున్నదా?

కల్వకుంట్ల కవితకు, భారత రాష్ట్ర సమితికి మధ్య అంతంత మాత్రంగా ఉన్న అనుబంధం పుటుక్కుమని తెగిపోవడం ఇక లాంఛనం మాత్రమే. ఇవాళో రేపో ఆ బంధం తెగిపోనుంది. నిజానికి కల్వకుంట్ల కవిత.. చాలా కాలంగా భారత రాష్ట్ర సమితికి మానసికంగా దూరం అయ్యారు. తెలంగాణలో తాజా పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి బాగోతంపై సీబీఐ తో దర్యాప్తు చేయించాలని రేవంత్ సర్కారు నిర్ణయించడం వంటి వ్యవహారాలు.. కవితకు- ఆమె ఇంటి పార్టీకి మధ్య నివురుగప్పిన నిప్పులా రగులుతున్న మంటలను అగ్నిజ్వాలగా మార్చేశాయి. తన ద్వారా వివాదం రేగిన ప్రతిసారీ తండ్రి కేసీఆర్ పై అనల్పమైన ప్రేమను వ్యక్తం చేస్తూ వచ్చిన కవిత తాజాగా కూడా అదే వ్యూహాన్ని అనుసరించారు. తండ్రిపై సీబీఐ కేసు పెట్టే పరిస్థితి వచ్చిందని.. పాపం, ఆమె కళ్లనీళ్లు పెట్టుకున్నారు. కానీ.. సాయంత్రానికి వాటిల్లిన పరిణామాలను గమనిస్తే తండ్రిపై ప్రేమే పామై ఆమెను కాటేస్తున్నట్టుగా కనిపిస్తోంది. భారత రాష్ట్రసమితినుంచి కల్వంకుట్ల కవితను సస్పెండ్ చేయాలని గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇదివరకు పార్టీని కుదిపేసిన లేఖాస్త్రం వివాదానికి తాను కేంద్ర బిందువు అయినప్పుడు కూడా కవిత ఇదే విధంగా వ్యవహరించారు. అప్పట్లో కూడా ఆమె తండ్రి మీద అనల్పమైన ప్రేమను కురిపించారు. తన తండ్రి చుట్టూ దెయ్యాలు కొలువు తీరి ఉన్నాయని అన్నారు. తాను తన తండ్రికి లేఖ రాస్తే దానిని కూడా మీడియాకు లీక్ చేయడంలోనే ఈ కుట్రలు అర్థమవుతున్నాయని కూడా అన్నారు. ఇప్పుడు కూడా.. తన తండ్రి మీద సీబీఐ కేసు పెడుతోంటే రాష్ట్రం మొత్తం ఇంకా తగలబడిపోలేదే అని కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె తన అన్న కల్వకుంట్ల తారకరామారావు పేరు ప్రస్తావించడం లేదు. కానీ.. ఎంత ఇరిగేషన్ మంత్రి హరీష్ అయినప్పటికీ.. కేటీఆర్ ప్రమేయం లేకుండా ఏ పనైనా భారాస ప్రభుత్వంలో జరిగేదని ఎవ్వరూ అనుకోరు. కానీ.. కేటీఆర్ పేరు కవిత చెప్పకపోవడం వ్యూహాత్మకం అని పలువురు భావిస్తున్నారు. తండ్రమీద ప్రేమను వ్యక్తం చేయడంలో భాగంగా.. ముందుముందు ఆమె కేటీఆర్ కూడా తండ్రికి అప్రతిష్ట తెచ్చారని ఆరోపించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. తన తండ్రి పరిశుద్ధుడు.. చుట్టూ ఉన్న బావ, అన్నలు దుర్మార్గులు అని ప్రజలను నమ్మిస్తే.. ప్రజలు తనకు నీరాజనం పడతారని ఆమె అనుకోవచ్చు. కానీ.. తండ్రి మీద ఆమె ఈ విధంగా చూపిస్తున్న ప్రేమ ఆమెకే గండంగా మారుతోంది. పార్టీ పరువు బజారులోకి లాగినందుకు ఆమెను కేసీఆర్ సస్పెండ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories